శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 15 మే 2024 (12:54 IST)

మా కూటమిలో ఓడేదెవరో చెప్పలేకపోతున్నాం, వైసిపిలో గెలిచేదెవరో తెలయడంలేదు: రఘురామ

raghurama
ఉండి నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓటింగ్ పూర్తయిన తర్వాత మా కూటమిలో ఓడిపోయేదవరో చెప్పలేకపోతున్నామని అన్నారు. అదేసమయంలో వైసిపిలో గెలిచేవారు ఎవరో కూడా అర్థం కావడంలేదంటూ సెటైర్లు వేసారు.
 
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు పిఠాపురంలో వచ్చే మెజార్టీ విషయంలో తాను వేసిన అంచనా తప్పేలా ఉందని రాజు వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, ఏపీలో పోలింగ్ సరళి చూశాక తన అంచనాలు తారుమారయ్యేలా కనిపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా, కూటమికి మరిన్ని స్థానాలు వస్తాయని తెలిపారు. 150కి పైగా ఎమ్మెల్యే స్థానాలతో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
 
మెజార్టీల విషయంలోనూ తన అంచనాలు సవరిస్తున్నట్టు చెప్పారు. నెలకిందట పవన్ కళ్యాణ్‌ వద్దకు వెళ్ళానని, అపుడు ఆయనకు 50 వేల నుంచి 55 వేల మెజార్టీ రావొచ్చని భావించానని చెప్పారు. కానీ ఇపుడు తన అంచనా తప్పేలా ఉందన్నారు. పవన్ కళ్యాణ్‌కు పిఠాపురం నియోజకవర్గంలో 65 వేలకు పైగా మెజార్టీ రావొచ్చన్నారు. కొన్ని బూత్‍‌లలో పవన్‌‍కు అనుకూలంగా 80 శాతం మేరకు పోలింగ్ జరిగినట్టు తెలుస్తుందన్నారు. 
 
అలాగే, కుప్పంలో కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 60 వేల మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పారు. చంద్రబాబును ఓడించడానికి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు డబ్బులు ఇచ్చారని, అయినప్పటికీ గెలుపు మాత్రం చంద్రబాబుదేనని జోస్యం చెప్పారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబుపై కన్నా లక్ష్మీనారాయణ భారీ మెజార్టీతో గెలుస్తారన్నారు. 
 
ఇకపోతే, పశ్చిమ గోదావరి జిల్లాలో వార్ వన్‌సైడ్ అని, కూటమి క్లీన్ స్వీప్ చేయడం తథ్యమని రఘురామ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరిలో అందరూ నెగ్గుతారని వెల్లడించారు. అయితే ఇవన్నీ కరెక్టా, కాదా అనేది జూన్ 4న తెలుస్తుందని పేర్కొన్నారు. తన అంచనాలు ఖచ్చితంగా నిజమవుతాయని నమ్ముతున్నట్టు వివరించారు.