భద్రాద్రి రామయ్యకు గోటి తలంబ్రాలు: పెళ్లిపనులకు శ్రీకారం
భద్రాద్రి రామయ్య పెళ్లి పనులకు శ్రీకారం.. గోటి తలంబ్రాలు సిద్ధం
భద్రాద్రి రామయ్యకు గోటి తలంబ్రాలు వలిచారు. ఖమ్మం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం గ్రామానికి చెందిన కోదండ రామాలయ భక్త బృందం నాలుగు నెలల పాటు భక్తితో శ్రమించి స్వామి వారికి గోటితో తలంబ్రాలు వలిచారు. ఈ తలంబ్రాలతో పాదయాత్రగా గ్రామం నుంచి బయలుదేరిన భక్త బృంద సభ్యులు బుధవారం భద్రాచలం కోదండ రాముని ఆలయానికి చేరుకున్నారు.
సుమారు 200 మంది భక్తులు ‘జై శ్రీరామ్’ అంటూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు తెచ్చిన తలంబ్రాలను అర్చకులకు అందజేశారు. రామయ్యకు ప్రత్యేక అభిషేకం ఆలయంలోని బేడా మండపంలో స్వామి వారికి బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏప్రిల్ 15న శ్రీరామనవమి సందర్భంగా ఆలయ అధికారులు, వేదపండితులు స్వామి వారి పెళ్లి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రస్వామికి తలంబ్రాలు కలిపే కార్యక్రమం బుధవారం నిర్వహిస్తారు.

