కార్తీక సోమవారం రోజు శివుడిని, చంద్రుడిని పూజిస్తే..?
కార్తీక సోమవారం రోజు నదీస్నానం చేయడం, దీప దానం ఆచరించడం విశేషమైన ఫలితాలను కలిగిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ముత్తయిదువులు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే మాంగల్య భాగ్యం కలుగుతుందట. అలాగే.. శివుడిని బిల్వ దళాలతో పూజించడం వల్ల మనోభీష్టం నెరవేరుతుందని విశ్వాసం.
సోమవారం చంద్రుడికి సంబంధించింది కాబట్టి చంద్రుడిని పూజించడం వల్ల కూడా మనశ్శాంతి లభిస్తుంది. కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే కార్తీక సోమవారం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైర రోజు. ఈ రోజున శివారాధన చేసినా, శివ నామస్మరణ చేసినా, శివుడికి అభిషేకం చేసినా విశేషమైన ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు.
ఈ కార్తీక సోమవారం రోజున పవిత్రమైన భోళా శంకరుడిని పూజిస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. కార్తీక మాసంలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు. కాబట్టి కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామున ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందట.
బిల్వార్చన చేయడం కూడా పవిత్రమైనది. అంతే కాకుండా ఈ మాసంలో శివారాధనతో పాటు శ్రీమహావిష్ణువును పూజించడం కూడా శుభప్రదం. కార్తీక మాసంలో కుదరకపోతే.. ఒక్క కార్తీక సోమవారమైనా ఉపవాసం ఉండాలని పెద్దలు చెబుతారు. ఉపవాసం ఆరోగ్యానికి కూడా మంచిదని పెద్దల మాట.
ఉపవాసం ఆచరించడం ద్వారా శరీరానికి స్వస్థత చేకూరడమే కాకుండా ప్రశాంతత కలుగుతుంది. మానసిక ప్రశాంతతకు, ఇంద్రియ నిగ్రహానికి సైతం ఉపవాసాన్ని మించిన మందులేదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

