1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Surge in Viral Fevers And Flu Across Hyderabad

హైదరాబాద్ నగర వాసులను వణికిస్తున్న వైరస్...

Viral Fever
హైదరాబాద్ నగర వాసులను ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ 'ఇన్ ఫ్లూయెంజా ఎ' రకం వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిలోఫర్ పాటు కొన్ని ప్రైవేటు చిన్న పిల్లల ఆసుపత్రులు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. 60 ఏళ్లు దాటిన చాలామంది ఆసుపత్రిలో చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు. కొందరిలో తీవ్రత పెరిగి ప్రాణాల మీదకు వస్తోందంటున్నారు. అయితే సాధారణ జ్వరమే అని నిర్లక్ష్యం చేస్తే ఈ వైరస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇన్‌ఫ్లుయెంజా వైరస్ సోకిన వారిలో హఠాత్తుగా అధిక జ్వరం, గొంతు నొప్పి, పొడిదగ్గు, తీవ్ర తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ఆలసట వంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. తుమ్ములు, దగ్గు ద్వారా గాలిలోకి విడుదలయ్యే తుంపరల వల్ల ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, మధుమేహం, ఆస్తమా వంటి దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవారు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. 
 
ఇన్‌ఫ్లుయెంజాలో సాధారణ జ్వరానికి, ప్రమాదకరమైన పరిస్థితికి మధ్య తేడాను గుర్తించడం అత్యంత కీలకమని వైద్యులు అంటున్నారు. ప్రారంభంలో సాధారణ ప్లూలాగే కనిపించినప్పటికీ కొందరిలో ఇది వేగంగా ఊపిరితిత్తులకు చేరి తీవ్రమైన న్యూమోనియాగా శ్వాసకోశ వైఫల్యానికి దారితీసే అవకాశం ఉంటుందన్నారు. ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది రావడం, ఆయాసం పెరగడం, పిల్లికూతలు, శ్వాస వేగంగా తీసుకోవడం, ఛాతీ భాగంలో నొప్పి, బరువుగా గుండె పట్టేసినట్లు అనిపించడం, శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయి పెదవులు, గోళ్లు, ముఖం నీలం రంగులోకి మారడం, తలతిరగడం, స్పృహ కోల్పోవడం, తీవ్రమైన మగత, అయోమయ పరిస్థితి, ఆగకుండా వాంతులు ఉంటే ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
పింప్రి చించ్వాడ్ శివాలయంలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం, సిసిటీవీలో రికార్డ్