1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. telangana dy cm bhatti vikramarka talk about false news about him

ఆస్తుల సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు.. కట్టు కథలకు భయపడను : భట్టి విక్రమార్క

bhatti vikramarka
ఆస్తుల సంపాదన కోసమే, తన వ్యాపారాలను విస్తరించడం కోసమే తాను రాజకీయాల్లోకి రాలేదని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అలాగే, తనపై మీడియాలో వచ్చే కట్టు కథనాలకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అదేసమయంలో తెలంగాణ ప్రభుత్వ ఆస్తులు, ఆత్మను కాపాడటమే తన లక్ష్యమన్నారు. 
 
ఆయన ప్రజాభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, నైనీ బొగ్గు బ్లాక్‌ టెండర్ల విషయంలో ఓ పత్రికలో అడ్డగోలు రాతలు రాశారన్నారు. రాష్ట్ర ఆస్తులు, వనరులను సంరక్షించి పేదలకు సమానంగా పంచడమే నా లక్ష్యం. సింగరేణి సంస్థ.. నైనీ బొగ్గు బ్లాక్‌ టెండర్లను పిలిచింది. దీనిపై కట్టుకథ, పిట్టకథలు అల్లి ప్రజలను మభ్యపెట్టేలా కథనం రాశారు. 
 
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టెండర్లు పిలవాలని సింగరేణి సంస్థకు సూచించాం. నేను వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి సన్నిహితుడిని కాబట్టి.. ఆయనపై ఉన్న కోపం నామీద చూపిస్తున్నారు. ఆ పత్రికలో వచ్చిన కథనం వెనుక రాజకీయ ఉద్దేశం ఏమిటో తెలిశాక పూర్తి వివరాలు వెల్లడిస్తా. గద్దలు, దోపిడీదారులు, వ్యవస్థీకృత నేరగాళ్ల నుంచి తెలంగాణ ఆస్తులను కాపాడతాను.
 
ఒకరి వ్యక్తిత్వాన్ని హననం చేసే కథనాలు రాసే అధికారం ఎవరికీ లేదు. నాయకుల మధ్య విభేదాలు సృష్టించేందుకు కట్టుకథలు రాశారు. దీనికి భయపడి లొంగిపోయే వ్యక్తిని కాదు. సింగరేణి ప్రజల ఆస్తి.. బొగ్గుగనులు ప్రజల ఆత్మగౌరవం. పదవుల కోసం కాదు.. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. 
 
టెండర్లను పిలిచింది సింగరేణి సంస్థే.. మంత్రి కాదు. క్లిష్ట ప్రాంతాల్లో గనులున్నందున ఫీల్డ్ విజిట్ నిబంధన తప్పనిసరి. ఇలాంటి నిబంధనలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనూ ఉన్నాయి. ఓ ఛానల్‌ కథనంలో నా పేరును అనవసరంగా తీసుకువచ్చారు. మీడియా సంస్థల మధ్య ఉన్న విషయాల్లోకి ప్రజాప్రతినిధులను లాగొద్దు. వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్లడం తగదు అని భట్టి విక్రమార్క అన్నారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
అమృత్ భారత్ రైళ్లలో ఆర్ఏసీ రద్దు.. ఇక కేవలం బెర్తులు మాత్రమే కేటాయింపు