సీఎంగా రేవంత్ రెడ్డి పదేళ్లు ఉంటారని ఎలా చెబుతారు : మంత్రి కొండా సురేఖ ప్రశ్న
అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలపై తన మనసులోని మాటలను బహిర్గతం చేశారు. ముఖ్యంగా, పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే ఉంటారని ఎలా చెబుతారని ఆమె ప్రశ్నించారు. బీసీని అయిన తనకో న్యాయం, ఇతర సామాజిక వర్గానికో న్యాయమా అని అడిగారు.
తన ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలను ఇంకా కలవలేదని చెప్పారు. అలాగే, మంత్రి పదవికి తనను రాజీనామా చేయమని అధిష్టానం పెద్దలు ఎవరూ అడగలేదన్నారు.
క్యాబినెట్‌లో ఉన్న ఇతర సామాజిక వర్గాల వారిపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటికీ ఏం సమాధానం చెబుతారు? ఏం చర్యలు తీసుకుంటారు? జరుగుతున్న అన్ని వ్యవహారాలపై ఇప్పటికే ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ సహా అధిష్ఠాన ముఖ్యులందరికీ రాతపూర్వకంగా తెలియజేశాను. అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని బుధవారం ఖర్గేను కలిసిన సందర్భంగా కోరాను అని కొండా సురేఖ అన్నారు.
