1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Greater Hyderabad Election Results Today

నేడు జీహెచ్ఎంసీ ఫలితాలు - 2 గంటల్లోనే తేలనున్న జయాపజయాలు

Greater Hyderabad Election Results Today
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఈ ఎన్నికల పోలింగ్ ఈ నెల ఒకటో తేదీన బ్యాలెట్ విధానంలో జరిగిన విషయం తెల్సిందే. ఈ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభంకానుంది. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు వివిధ ప్రాంతాల్లో జరుగనుంది. 
 
అయితే, ఈసారి బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరుగడంతో ఫలితాల వెల్లడి కొంత ఆలస్యమయ్యే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. మొత్తం 150 డివిజన్లకు సంబంధించి వార్డుకు ఒక కౌంటింగ్‌ హాల్‌ చొప్పున ప్రతి హాల్‌లో 14 టేబుల్స్‌పై ఓట్లను మదించనున్నారు. ఒక్కో టేబుల్‌పై గంటకు వెయ్యి చొప్పున 14 వేల ఓట్లు లెక్కిస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ లెక్కన 28 వేల లోపు ఓట్లు పోలైన డివిజన్‌ల్లో కౌంటింగ్‌ మొదలుపెట్టిన రెండు గంటల్లోనే జయాపజయాలు ఖరారు కానున్నాయి. 
 
తక్కువ ఓట్లు పడిన మెహిదీపట్నం (11,818) నుంచి తొలిఫలితం రావచ్చని భావిస్తున్నారు. ఎక్కువ ఓట్లు పడిన మైలార్‌దేవ్‌పల్లి (37,445) డివిజన్‌ ఫలితం అన్నింటికంటే చివరన వచ్చే అవకాశముంది. బ్యాలెట్‌ పేపర్లు బయటికి తీసి, కట్టలు కట్టే ప్రక్రియను పూర్తి చేసుకున్నాక మధ్యాహ్నంలోపు తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి సాయంత్రానికే అన్ని డివిజన్ల ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు.
తర్వాతి కథనం
బలహీనపడిన బురేవి... పంపన్‌కు సమీపంలో తీరందాటే ఛాన్స్