శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2020 (20:58 IST)

ఓ బక్కాయనపై ఇంతమంది బీజేపీ బాహుబలుల దండయాత్రనా?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. అయితే, ప్రచారం చివరి రోజున కేంద్ర హోం మంత్రి అమిత్ షా భాగ్యనగరికి వచ్చి రోడ్‌షో నిర్వహించారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో ఎక్కడలేని సంతోషం నెలకొంది. అయితే, బల్దియా ఎన్నికలను బీజేపీ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ స్పందించారు. ఒక్క బక్కాయనను ఎదుర్కొనేందుకు బీజేపీ నుంచి ఇంత మంది బాహుబలులా అంటూ ప్రశ్నించారు. 
 
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన అనేక మంది జాతీయ నేతలు ప్రచారం చేయడంపై నారాయణ స్పందిస్తూ, ఒక బ‌క్కాయ‌న‌ను ఎదుర్కొనేందుకు ఇంత‌మంది కాషాయ బా‌హుబ‌లులు రంగంలోకి దిగారన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ట్టు లేదు.. రాష్ట్ర ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ట్లుగా ఉంద‌న్నారు.
 
నిన్న కొవిడ్ సెంటిమెంట్, ఈరోజు నేడు మతపరమైన సెంటిమెంట్లు, అనైతిక రాజకీయ విన్యాసాలతో దేశప్రధాని మోడీ, హోంత్రి అమిత్‌షా బరితెగించారంటే లౌకిక నీతిసూత్రాలను వెక్కిరించడమేగదా అన్నారు. 
 
ఒకవైపు కోట్లాది మంది రైతాంగం అగ్గిపై నుంచొని ప్రాణాలకు తెగించి బారికేడ్ల‌ను తోసి, క‌రోనా మహమ్మారిని లెక్కచేయక ఢిల్లీని ఆక్రమించారు. వారికి సమాధానం చెప్పలేని మోడి ప్రభుత్వం నేలవిడచి సాముచేస్తూ హైదరాబాద్ రాజకీయ వలస బాటపట్టారన్నారు. బీజేపీ ఢిల్లీలో పారేసుకున్న సూదిని హైద్రాబాద్‌లో వెతుక్కుంటుంద‌న్నారు. 
 
ఈ పరిణామాలన్నింటిని గమనించిన తర్వాత అయిన లౌకికవాద శక్తులు ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. బీజేపీకి హైదరాబాద్ ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పాలని కె.నారాయణ పిలుపునిచ్చారు.