1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Thunder Lightning takes Two lives in Macherial District

బైక్‌పై వెళుతుంటే పిడుగుపడి... తల్లీకొడుకు మృత్యువాత

Thunde Lightning
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో ఓ విషాదకర ఘటన జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన తల్లీ కొడుకు మృత్యువాతపడ్డారు. వీరంతా బైకుపై వెళుతుంటే పిడుగుపడటంతో చనిపోయారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన పి.వెంకటేశ్ (35), మౌనిక (27) భార్యాభర్తలు. కుమారులు విశ్వతేజ (5), 18 నెలల శ్రేయాన్‌తో కలిసి మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని సీసీసీలో నివాసం ఉంటున్నారు. 
 
వెంకటేశ్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అయితే, శ్రేయాన్ అనారోగ్యానికి గురికావడంతో పెద్ద కుమారుడు విశ్వతేజను అమ్మమ్మ వద్ద దించిన వెంకటేశ్.. సోమవారం ఉదయం భార్య, చిన్నకుమారుడితో కలిసి బైక్‌పై ఆసుపత్రికి చేరుకున్నారు. 
 
అక్కడ శ్రేయాన్‌ను చూపించిన అనంతరం వర్షంలో తడుస్తూనే ఇంటికి బయలుదేరారు. రైల్వే వంతెన వద్దకు వచ్చే సరికి వారి బైక్‌కు సమీపంలో భారీ శబ్దంతో పిడుగుపడటంతో వారు ముగ్గురూ చెల్లాచెదురుగా పడిపోయారు.
 
దీన్నిగమనించిన స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు తల్లీకుమారులు మరణించినట్టు నిర్ధారించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వెంకటేశ్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఎనిమిదేళ్లకే 5,642మీ. పర్వతమెక్కిన భువన్‌.. తెలుగు బుడ్డోడి రికార్డ్