శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , సోమవారం, 20 సెప్టెంబరు 2021 (12:49 IST)

గుంటూరు బ్రాంచ్ కెనాల్లో ముగ్గురు యువ‌కుల గ‌ల్లంతు

పుట్టెంటుకులు తీసే కార్య‌క్ర‌మానికి వెళుతూ, తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయారు ముగ్గురు యువ‌కులు. శుభ‌కార్యానికి వెళుతూ, మ‌ధ్య‌లో ఈత కొట్టాల‌ని వారు ప‌డిన ఆరాటం, చివ‌రికి మృత్యువాత‌కు దారితీసింది.

గుంటూరులోని బ్రాంచ్ కెనాల్‌ (జీబీసీ)లో కండ్లగుంట గ్రామం వద్ద ఈతకు దిగిన ముగ్గురు యువకులు గల్లంత‌య్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. గుంటూరుకు చెందిన కొందరు నకరికల్లు మండలం చల్లగుండ్లలో పుట్టువెంట్రుకల కార్యక్రమానికి హాజరయ్యారు. వీరిలో ఆరుగురు ఆటోలో, ఇద్దరు బైక్‌పై కండ్లగుంట మీదుగా నరసరావుపేట వెళ్లేందుకు బయలుదేరారు. కండ్లగుంట వద్దకు రాగానే వీరిలో ముగ్గురు స్నానానికి దిగారు. స్నానానికి దిగిన వారిలో వుల్లంగుల కోటేశ్వరరావు, పగడాల అశోక్‌ (34), ఆటో డ్రైవర్‌ సామి సురేష్‌బాబు (36)లు ఉన్నారు. వీరు ముగ్గురు ప్రవాహంలో కొట్టుకుపోగా, ఆటో డ్రైవర్‌ సురేష్‌బాబు మృతదేహాన్ని బయటకుతీశారు. అశోక్‌, కోటేశ్వరరావుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నకరికల్లు ఎస్‌ఐ పి. ఉదయబాబు తన సిబ్బందితో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.