ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 18 సెప్టెంబరు 2021 (13:09 IST)

పరిషత్‌ ఓట్ల లెక్కింపుపై గుంటూరులో ఎస్‌ఈసీ సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నీ సమీక్ష నిర్వహించారు. గుంటూరులోని కలెక్టరేట్‌లో ఆమె అధికారులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆమె జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై చర్చించారు. సమీక్ష అనంతరం ఆమె కౌంటింగ్‌ కేంద్రాలను సందర్శించనున్నారు. సమావేశంలో కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌, డీఐజీ త్రివిక్రమ వర్మ, ఎస్పీ ఆరీఫ్‌ హాఫిజ్‌, రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ తదితరులు పాల్గొన్నారు.
 
ప్రకాశం జిల్లాలో సమర్థంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ
ప్రకాశం జిల్లాలో సమర్థంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. హైకోర్టు ఆదేశాలు, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు జడ్.పి.టి.సి., ఎమ్.పి.టి.సి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 19వ తేదీన చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ఎనిమిది ప్రాంతాలలోని 12 ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. జడ్.పి.టి.సి., ఎమ్.పి.టి.సి. ఎన్నికలలో 51 శాతం ఓట్లు పోలయ్యాయని, 8.99 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. అవసరమైన టేబుళ్లు, విద్యుత్, త్రాగునీటి, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించామన్నారు.

కొన్ని పాఠశాలల్లో పరీక్షలు జరుగుతున్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవాలు చేయరాదని ఆయన స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో 300 మందికి పైగా ఆర్.ఓ.లు, ఏ.ఆర్.ఓ.లు విధుల్లో ఉంటారని కలెక్టర్ చెప్పారు. మరో 300లకు పైగా కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు నియమించామన్నారు.