ఫైట్ చిత్రీకరణలో విశాల్‌కు తప్పిన పెను ప్రమాదం - తలకు గాయం
తమిళ స్టార్ హీరో విశాల్‌కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. తాను నటిస్తున్న నాట్ ఏ కామన్ మేన్ అనే చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగులో భాగంగా ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. కానీ, తలకు మాత్రం గాయమైంది. ఆ తర్వాత ప్రాథమిక చికిత్స చేయించుకుని తిరిగి యధావిథిగా ఆ ఫైట్ సన్నివేశాన్ని విశాల్ పూర్తిచేశారు.
శనివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రస్తుతం విశాల్ నాట్ ఏ కామన్ మేన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. ఇందులోభాగంగా ఓ ఫైట్ సీన్ చేస్తుండగా విశాల్ తలకు గాయమైంది.
డూప్ లేకుండా చేస్తున్న ఈ చిత్రీకరణ సమయంలో విశాల్ తల వెనుక భాగంలో ఓ సీసా తగిలింది. అయితే అదృష్టవశాత్తూ ఆయనకు పెద్దగా గాయాలు కాకపోవడంతో చిత్రయూనిట్ ఊపిరి పీల్చుకుంది. అంతేకాకుండా ప్రమాదం జరిగినా బ్రేక్ తీసుకోకుండా విశాల్ నటించడం విశేషం.
ఇక ఈ ప్రమాదంపై హీరో విశాల్ స్పందిస్తూ.. "తృటిలో తప్పించుకున్నానని, ఆ ఫైటర్ తప్పేమీ లేదన్నారు. టైమింగ్ మిస్ అయ్యిందని, అయినా యాక్షన్ సీన్లలో ఇలాంటివి జరగడం సాధారణమే. ఆ దేవుడి దయ, అందరి ఆశీస్సులతో మళ్లీ షూటింగ్ కంటిన్యూ చేశామని, యాక్షన్ సీక్వెన్స్‌ను ఇంత అద్భుతంగా తెరకెక్కించినందుకు ఫైట్ మాస్టర్ రవివర్మకు థ్యాంక్యూ" అని విశాల్ పేర్కొన్నారు.
పైగా, ఫైట్ సీన్స్‌కు సంబంధించిన వీడియోను విశాల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక విశాల్31వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పి. శరవణన్ దర్శకత్వం వహిస్తుండగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫ్యాక్టరీపై నిర్మిస్తున్నారు.