విమానంలో కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం - మద్యం మత్తులో సెల్ఫీ కోసం యత్నం...
ప్రముఖ నటి కీర్తి సురేశ్‌కు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. ఓ ప్రయాణికుడు పీకల వరకు మద్యం సేవించి కీర్తి సురేశ్‌తో సెల్ఫీకి పదేపదే ప్రయత్నించి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీంతో విమాన సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని కీర్తి సురేశ్ స్వయంగా వెల్లడించడం గమనార్హం.
'నా భర్త ఆంటోని థట్టిల్‌తో కలసి మిలాన్ నుంచి భారత్‌కు విమానంలో వస్తుండగా, ఓ ప్రయాణికుడు నన్ను సెల్ఫీ కోసం అడిగాడు. కానీ అతడు మద్యం మత్తు వల్ల సరిగా నిలబడలేని స్థితిలో ఉన్నాడు. కాసేపు ఆగమని చెప్పాను. కానీ అతడు వినిపించుకోకుండా, ఇప్పుడే సెల్ఫీ తీసుకుంటానంటూ ఒత్తిడి చేశాడు. నేను ఎప్పుడు ఫొటో తీసుకోవాలన్నది మీరు నిర్ణయించకూడదు అని అతడికి స్పష్టంగా చెప్పాను.
అయినా అతడు వినిపించుకోలేదు. నా భర్త కూడా అతణ్ని వారించే ప్రయత్నం చేసినా అతని తీరులో మార్పు రాలేదు. దీంతో మేం విమాన సిబ్బంది దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సి వచ్చింది' అని కీర్తి సురేశ్ చెప్పారు. అభిమానులతో ముచ్చటించడాన్ని తానెప్పుడూ ఇష్టపడతానని, అయితే వ్యక్తిగత హద్దులను గౌరవించని కొందరు వ్యక్తుల నుంచే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయని కీర్తి అన్నారు. కొందరు అభిమానులు మాత్రం తనతో చాలా ఆప్యాయంగా మాట్లాడతారని, వారు తనను సెల్ఫీ కూడా అడగరని వెల్లడించారు.

