1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ninne Pelladatha 30 years Telugu classic anniversary

'నిన్నే పెళ్లాడతా'కు 30 సంవత్సరాలు.. టబు ఎమోషనల్ పోస్ట్

nagarjuna - tabu
కింగ్ నాగార్జున - టబు జంటగా నటించిన చిత్రం నిన్నే పెళ్లాడతా. తెలుగు చిత్రసీమలో వచ్చిన క్లాసిక్స్ మూవీలో ఇదొకటి. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ విడుదలై సోమవారానికి 30 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర హీరోయిన్ టబు సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర, ఎమోషనల్ పోస్ట్ చేసారు. ఇందులో ఆ నాటి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. 
 
తన ఇన్‌స్టాఖాతాలో ఆ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ, 'హృదయాలను కొల్లగొట్టిన ప్రేమకథ, కాలపరీక్షకు నిలిచిన గాథ, తరతరాలను మంత్రముగ్ధులను చేస్తూనే ఉన్న పాటలు! మూడు దశాబ్దాల పాటు సాగిన 'నిన్నే పెళ్లాడతా' అద్భుత ప్రయాణాన్ని, దానిలోని మ్యాజిక్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నాను' అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఈ సినిమా కథ, ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానంలో నిలిచిపోతాయని టబు అన్నారు. 
 
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానరుపై స్వయంగా అక్కినేని నాగార్జున నిర్మించారు. ఇందులో నాగార్జున 'శీను' పాత్రలో నటించగా, టబు 'మహాలక్ష్మి' అలియాస్ 'పండు' పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. వీరితో పాటు చలపతి రావు, గిరిబాబు, చంద్రమోహన్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ, రవితేజ, లక్ష్మి వంటి భారీ తారాగణం నటించింది. 
 
విడుదలైన సమయంలో బాక్సాఫీస్ వద్ద 'నిన్నే పెళ్లాడతా' సంచలన విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. 1996 సంవత్సరానికిగాను ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుని తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు సందీప్ చౌతా టాలీవుడ్ పరిచయమైంది కూడా ఈ చిత్రంతోనే. ఆయన స్వరపరిచిన పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
Vijay Deverakonda: చారిత్రకథాంశంగా విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ డేట్ ప్రకటన