తెలుగు రాష్ట్రాల్లో 77వ గణతంత్ర దిన వేడుకలు.. ప్రజలకు శుభాకాంక్షలు
దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర దిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు మంత్రులు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఎగరవేశారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో ఈ వేడుకలు నిర్వహించారు.
రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితోపాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ స్వీకరించారు.
తెలంగాణ వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి అధికారిక కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు.
