మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 మార్చి 2018 (13:23 IST)

అమిత్ షా హిందువేనా? : సీఎం సిద్ధరామయ్య ప్రశ్న

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మతంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు అమిత్ షా హిందువేనా అంటూ ఓ ప్రశ్న సంధించారు. హిందూ మతాన్ని విభజించేందుకు కుట్రలు చేస్తున్

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మతంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు అమిత్ షా హిందువేనా అంటూ ఓ ప్రశ్న సంధించారు. హిందూ మతాన్ని విభజించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ తమపై నిందలు మోపే అమిత్ షా ఏ మతానికి చెందినవారో దేశ ప్రజలకు వివరించాలని ఆయన చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అమిత్ షా హిందూ మతానికి చెందినవారా? లేక జైన మతానికి చెదినవారా? అని ప్రశ్నించారు. అమిత్‌ షా తమను చూసి ఆందోళన చెందుతున్నారని, అందుకే తాము ఎక్కడ ప్రచారం నిర్వహిస్తే ఆ తర్వాత అక్కడే ఆయన పర్యటిస్తున్నారని విమర్శలు గుప్పించారు. 
 
తమ రాష్ట్రంలో గత యేడాది జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అమిత్ షా కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేశారని, కానీ ఫలితాలు మాత్రం తమకు అనుకూలంగా వచ్చాయన్నారు. మే 12న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే తరహా ఫలితాలే పునరావృతమవుతాయని చెప్పారు. 
 
ఇకపోతే, తాను ఈ దఫా ఎన్నికల్లో కూడా చాముండేశ్వరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పటివరకు ఈ స్థానం నుంచి తాను ఏడు సార్లు పోటీ చేస్తే, ఐదుసార్లు గెలిచానని సిద్ధరామయ్య గుర్తు చేశారు.