1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
  4. International World Water Day 2016

“జలో రక్షితి రక్షతః - జలంతోనే జగతి”... ఓ యువతా... నీరు కోసం మీరు కూడా...

ప్రాణికోటికి మూలాధారమైనది నీరు. నీరు లేకపోతే గృహ, వ్యవసాయ, పారిశ్రామిక తదితర అన్ని కార్యక్రమాలు స్తంభించిపోతాయి. ప్రపంచ జనాభా పెరిగేకొద్దీ నీటి అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచంలోని పలు ప్రాంతాలలో

#WorldWaterDay
ప్రాణికోటికి మూలాధారమైనది నీరు. నీరు లేకపోతే గృహ, వ్యవసాయ, పారిశ్రామిక తదితర అన్ని కార్యక్రమాలు స్తంభించిపోతాయి. ప్రపంచ జనాభా పెరిగేకొద్దీ నీటి అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచంలోని పలు ప్రాంతాలలో నీటి అవసరం ఇప్పటికే అదనపు సరఫరాను మించి పోయింది. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా నీటి అవసరాలు పెరుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల వర్షాలు పడకపోవడం, భూగర్భ జలాలు ఇంకిపోవడం, నీటిని సంరక్షించుకునే ప్రయత్నాలు చేయకపోవడం, నీటిని వృధా చేయడం తదితర కారణాల వల్ల జల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 
ఫోటో కర్టెసీ-యూఎన్
 
ముందుముందు జరగబోయే యుద్ధాలన్నీ నీటి కోసమే అని పర్యావరణవేత్తలు చేసిన హెచ్చరికలను అంగీకరించాల్సిన పరిస్థితులే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి. కాలం అనుకూలిస్తే సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే వర్షపు నీరు లభ్యమవుతుంది. ఆ నీటిని సంరక్షించకపోవడం వల్లే దుర్భిక్ష పరిస్థితులు నెలకుంటున్నాయి. చెరువులు, కుంటలలో నిలువ చేసిన నీటిలో చాలా భాగం ఆవిరి రూపంలో వృథా అవుతుంది. నీటిని భూమిలోకి ఇంకేలా చేసి భూగర్భ జలాలు సమృద్ధి పర్చాలి. ప్రస్తుతం వర్షపు నీటి వినియోగం కేవలం పది శాతం మాత్రమే. అందుకే ప్రతి వర్షపు నీటి చుక్కను భూమిలో ఇంకేటట్లు చూడాలి.
 
మనం నివసించే భూగోళంలో 70 శాతం నీరు ఉంది. ఐతే ఇందులో శుభ్రమైనది కేవలం 2.7 శాతం మాత్రమే. అందులో కూడా 75.2 శాతం మంచు రూపంలో ఉండగా 22.6 శాతం భీగర్భంలో ఉంది. మిగతా నీరు సరస్సులు, నదులు, వాతావరణంలో ఉంది. పర్యావరణ ప్రగతి అనే అంశం పై 1992లో రియోడి జెనెరోలో జరిగిన ఐక్యరాజ్యసమితి మహాసభలో ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన రూపుదిద్దుకుంది. భూగోళం మూడు వంతులు నీటితో నిండి ఉంది.దీనిలో 3% మాత్రమే మంచి నీరు, 97% ఉప్పునీరు. ఈ 3% నీటిలో కేవలం 0.26% మాత్రమే మానవాళి వినియోగానికి ఉపయోగకరము. 
 
ఈ నీరు భూఉపరితలములో నదులు,కాలువలు, చెరువులు, కుంటలు, సరస్సులు మరియు భూగర్భజల రూపంలో ఉన్నది. ప్రపంచంలో ఉన్న 240 మిలియన్ హెక్టార్ల పంట భూమిలో 30 మిలియన్ హెక్టార్లు ఉప్పుతో చౌడుగా మారాయి. కారణం అవసరానికి మించిన నీటిని వాడడమే. ప్రపంచంలో 22 శాతం నీరు పరిశ్రమలే వాడుతున్నాయి. ప్రపంచంలో 19 శాతం విద్యుచ్చక్తి, భారత దేశంలో 40 శాతం విద్యుచ్ఛక్తి హైడ్రోపవర్ (జల విద్యుత్) ద్వారానే పుడుతుంది. పరీవాహక ప్రాంతాల్లో అడవుల నరికివేత వల్ల చెరువుల్లో మట్టి మేటలు వేస్తుంది. 
 
అంతే కాకుండా అడవుల నరికివేత వలన వర్షపాతం కూడా తగ్గిపోయింది. భారతదేశంలో సగటున ప్రతి మనిషి అన్ని అవసరాలకి కలిపి 680 క్యూబిక్ మీటర్ల నీటిని వాడుతున్నారు. 6గురు ఉండే ఇంటికి 250 లీ నీరు అవసరమవుతుంది మన దేశంలో నదుల్లో ప్రవహించే మూడవ వంతు నీళ్ళు సముద్రాల్లోకి నష్టపోతున్నాం. భూగర్భ, భూఉపరితల జలాలు రెండూ కలిపి  దేశంలో వాడే మొత్తం నీటిలో 84 శాతం వ్యవసాయానికి, 12 శాతం పరిశ్రమలకి వాడుతున్నాం.
 
ఇంతటి విలువైన నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత నేటి యువతరం పై ఉంది. ప్రస్తుతం ఉన్న వర్షా భావ పరిస్థితుల్లో ప్రతి నీటిచుక్కను ఒడిసి పట్టుకొని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది.  నానాటికి ఇంకిపోతున్న భూగర్భ జలాల సంరక్షణ పై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి క్లిష్ట  పరిస్థితుల్లో  యువత  నేటి తరం కోసం – భావి తరాల కోసం కొన్ని బాధ్యతలను విధిగా నిర్వర్తించాల్సి వుంది.
ఫోటో కర్టెసీ-యూఎన్
వ్యక్తిగత బాధ్యత :-  నీటి సంరక్షణలో మొదటగా చేయాల్సింది నీటి వృధా అరికట్టడం. దైనందిన జీవితంలో మనం చాలా నీటిని వృధా చేస్తూ ఉంటాం. ముందుగా ప్రతి వ్యక్తి నీటి వృధాను అరికట్టే ప్రయత్నం చేయాలి. ప్రతి నీటి చుక్కా అమూల్యమైందే. మంచినీటిని పొదుపుగా వినియోగించాల్సిన అవసరం అందరిపై ఉంది. రోజువారీ అవసరాల్లో మనకు తెలియకుండానే నీటిని వృథా చేస్తుంటాం. ప్రతి ఒక్కరు ఒక్కో బకెట్ నీటిని ఆదా చేస్తే, నగరంలో ప్రతి రోజు పెద్ద పరిమాణంలో మంచినీటిని ఆదా చేసినట్టే  అనే విషయాన్ని అర్ధం చేసుకోవాలి. పళ్లు తోముకోవడానికి ఒక మగ్గు వాటర్ చాలు. కానీ ఈ పనికి దాదాపు 17 లీటర్ల నీరు వృథా అవుతుందనే విషయాన్ని గ్రహించాలి. స్నానం చేయాడానికి ఒక బకెట్ నీరు సరిపోతుంది. షావర్‌తో సాన్నం చేయడంతో 70 లీటర్ల నీరు వృథా అవుతుంది.
  
అట్లే కూరగాయాలను కడగటానికి లీటర్ వాటర్ సరిపోతుంది. కానీ ఈ పనికి  దాదాపు 19 లీటర్ల నీరు వృథా అవుతుంది. బకెట్ నీటితో కారు, మోటర్ వాహనాలను శుభ్రం చేయొచ్చు. కానీ వాటర్ పైపుతో శుభ్రం చేయడం వల్ల 350 నుంచి 700 లీటర్లు వృథా అవుతుంది. పంపుల లీకేజీల వల్ల రోజుకు 45 లీటర్ల నీరు వృధా అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సాధారణ ఒత్తిడితో నీరు వచ్చేలా పంపులను అమర్చుకోవాలి. ఇళ్ల ముందు గార్డెనింగ్‌లో ఇతర మొక్కలను పైపు ద్వారా నీటిని పట్టడం ఎందులోనైనా నీటిని నిల్వ చేసి పాత్రల సాయంతో చల్లితే ఉత్తమం. తాగునీటిని అందించే పబ్లిక్ నల్లాలు, ఇంట్లో ఏర్పాటు చేసిన నల్లాలను బిరడాలను లేదా ఆన్‌ ఆఫ్ చేసే పరికరాలను అమర్చుకోవాలి. ఇంటి ఆవరణను మొత్తం కాంక్రీట్ ఇతర టైల్స్‌తో నింపకుండా చుట్టుపక్కల కొంత భాగాన్ని మొక్కల కోసం వదిలిపెట్టాలి. ఇళ్లలో వృధా నీటిని భూమిలోకి ఇంకిస్తే భూగర్భ జల మట్టాన్ని పెంచినవారమవుతాం.
 
వ్యవసాయంలో నీటి వినియోగం: -  పంట భూముల్లో అవసరానికి మించి పంపులతో నీరును వదిలే విధానానికి స్వస్తి పల్కాలి.  డ్రిప్ పద్ధతి ద్వారా, బిందు సేద్యం ద్వారా నీటిని వినియోగాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి. పొలాల్లో చిన్న చిన్న నీటి గుంటలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకోవచ్చు. వర్షాభావ ప్రాంతాలలో – వర్షాభావ పరిస్థితుల్లో నీటి అవసరం అధికంగా ఉంటే మొక్కజొన్న, చెరుకు తదితర పంటల కన్నా అతి తక్కువ నీటి వినియోగం గల తృణ ధాన్యాల పంటల సాగు పై రైతులు దృష్టి సారించాలి.  డ్రిప్ పద్ధతి, బిందు సేద్యం, పొలాల్లో నీటి గుంటలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం వారు - వ్యవసాయ శాఖ వారు రైతులకు అందిస్తున్న సబ్సిడీలను గూర్చి , పథకాలను గూర్చి యువత రైతాంగానికి అవగాహన కల్పించాలి.
 
పారిశ్రామిక రంగంలో నీటి వినియోగం:-  పారిశ్రామిక రంగంలోను నీటిని అవసరానికి మించి వినియోగిస్తున్నారు. మరి ముఖ్యంగా భారీ పరిశ్రమాలలో ఈ నీటి వినియోగం అధికంగా కన్పిస్తుంది.  ఈ పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థమైన నీరు జలాశయాలలో కలిసి కలుషితమై నీటి వినియోగ కొరతకు కారణమవుతున్నాయి.  కాలుష్య నివారణ సంస్థ సూచనలను అనుసరించి ఈ.టి.పి., యస్.టి.పి శుద్ధి పద్ధతుల ద్వారా నీటిని శుద్ధి చేసే ప్రయత్నం చేయాలి.  ఈ విషయంలో  కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను ఉల్లఘించకుండా తగు చర్యలు తీసుకోవాలి. నీటి కాలుష్యానికి పాల్పడిన పరిశ్రమలపైన యువత ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాలి. అవసరమైతే ఉద్యమాలు చేపట్టాలి.
 
నీటి వనరుల పర్యవేక్షణలో యువత తీసుకోవాల్సిన మరికొన్ని బాధ్యతలు :-
1. చెట్ల పెంపకం కార్యక్రమంపై యువత దృష్టి సారించాలి.
2. బీడు బావులను, జలశయాలను పునద్ధరించే చర్యలు చేపట్టడం.
3. ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టుకునేలా, నిల్వ చేసుకునేలా, భూగర్భ జలాలు పెంపొందించేందుకు సాధ్యమైన చర్యలన్నింటినీ చేపట్టడం.
4. ఉపాధి పథకంలో భాగంగా కందకాల నిర్మామం, బండరాళ్ళ తొలగింపు, భూ ఉపరితల నీటి గుంటల నిర్మామం పట్ల దృష్టి సారించాలి.
5. నీటి వినియోగం పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేలా గ్రామగ్రామాన సదస్సులు నిర్వహించాలి. 
6. సేద్యపు బావుల్లో పూడికతీత, కొత్తగా సేద్యపు బావుల తవ్వకం, ఎండిన బావులకు పునరుజ్జీవం కల్పించడం, చెక్ డ్యాంలలో పూడికతీత, చిన్న నీటి పారుదల చెరువుల చుట్టూ కందకాలు తీయడం తదితర చర్యలను చేపట్టాలి.  
7. ఇళ్ళలో, కాలనీలలో, పాఠశాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో వాన నీటిని సేకరించి, దాచుకునే వ్యవస్థలను నెలకొల్పడం.
8. ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం సన్నగిల్లుతుందని, వర్షాతిరేకం వెల్లివిరుస్తుందన్న అంచనాల నేపథ్యంలో రాష్ట్రంలో చెరువులు, కుంటల సముద్ధరణ, సంరక్షణపై తక్షణం దృష్టి సారించాల్సి ఉంది. ఊరూరా చెరువులు, కుంటల సంరక్షణ చర్యలు చేపడితే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందనడంలో సందేహం లేదు. జూన్‌ - సెప్టెంబర్‌ మధ్యకాలంలో దేశంలో 89సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తుందని భారత వాతావరణ సంస్థ, అమెరికాలోని అంతర్జాతీయ వాతావరణ పరిశోధన సంస్థ, దక్షిణ కొరియా సంస్థ ఏపీఈసీ వాతావరణ కేంద్రం, 'స్కయిమెట్‌ వెదర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' సంస్థలన్నీ శుభం పలుకుతున్నాయి. 
9. ప్రతి బోరు యజమాని కనీసం 2 ఎకరాల క్యాచ్ మెంట్ కుంటలు, ఫారం ఫాండ్స్ నిర్మించాలి.
10. పూర్వం కాకతీయ రాజులు, నిజం నవాబులు, కృష్ణదేవరాయలు వంటి పాలకులు తక్కువ శ్రమశక్తితోనే చెరువులు, కుంటలు తవ్వుకోగలిగారు. అప్పట్లోనే రాజులు లోతైన చెరువులు తవ్వి భావితరాలకు గొప్ప మేలు చేశారు. కానీ నేడు ఇంత జనాభా, ఆధునిక యంత్రాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉండి కూడా ఆ చెరువుల్లో కనీసం పూడిక తీసుకోలేని దురవస్థలో  నేటి ప్రభుత్వాలున్నాయి. అయిదారువందల ఏళ్ల కిందట గానుగ సున్నంతో నిర్మించిన తూములు ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచి ఉండగా, నేడు అత్యాధునిక పరిజ్ఞానంతో, సాధనాలతో, సిమెంట్‌ కాంక్రీటులతో నిర్మించే నిర్మాణాలు మూణ్నాళ్ల ముచ్చటగా మిగులుతున్నాయి. లోపం ఎక్కడ జరుగుతోందో పసిగట్టి పరిహరించాల్సిన పాలకగణం కేవలం పదవులను నిలబెట్టుకునేందుకే ప్రాధాన్యమిచ్చి మిన్నకుండటం దురదృష్టకరం. నేటి పాలకుల నిర్లక్ష్య ధోరణి పట్ల యువత తమ నిరసనను తెలియజేయాలి. ప్రభుత్వ పనితీరును ప్రశ్నించాలి.

11. సోషల్ మీడియా, పత్రికలు – టివీ ఛానల్స్ ద్వారా కూడా యువత నీటి వనరుల పరిరక్షణ పట్ల  ప్రజలలో అవగాహన పెంపొందించే ప్రయత్నం చేయాలి. 
12. వ్యవసాయశాఖ అధికారులు కూడా క్షేత్ర స్థాయి సందర్శనలకు వెళ్ళి పంటల పై, నీటి వినియోగ తీరుతెన్నుల పై రైతులకు అవగాహన కలుగజేసే ప్రయత్నం చేయాలి.
13. వాన నీరు వృథా కాకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రయోజనం పొందే పద్ధతిది. వర్షపు నీరు ఎండిన బావి వైపు వచ్చేలా కాల్వలు తవ్వుకోవాలి. ఈ కాల్వలో మట్టి వడపోసి కేవలం నీరు మాత్రమే వచ్చే ఏర్పాటు చేయాలి. నాలుగు అంగుళాల వ్యాసం ఉన్న పైపు ద్వారా బావిలోకి నీరు చేర్చాలి. ఎండిన బావిని వర్షపు నీటితో నింపడంతో బోరు బావుల్లోకి నీరు వస్తుంది. బావి వెడల్పు తక్కువ గనుక ఎండకు ఆవిరై పోవడం అంతగా ఉండదు.
14. పట్టణ ప్రాంతాలలో బోరు బావులు, కుళాయిలు పక్కన నేల నీటిని గ్రహించడానికి వీలుగా రాళ్ళు, కంకర, దొడ్డు ఇసుకతో ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేయాలి. పట్టమాలు, నగరాల్లో డాబాలపై కురిసిన వర్షపు నీరు వృథా పోకుండా ఈ గుంతలలో చేర్చడం వల్ల భూగర్భ జలమట్టం పెరుగుతుంది.
15. భూమి ఎత్తు కన్నా కొంచెం తక్కువ ఎత్తులో ఉండేలా పొలాల్లో గుంతలు తవ్వాలి. పొలంలో పడ్డ వర్షపు నీరు ఈ గుంతల్లోకి చేరుతుంది. చిన్న పొలాలకయితే ఆ నీరు ప్రాణాధారంగా ఉపయోగపడుతుంది. పశువులకు తాగు నీరుగా వాడుకోవచ్చు. గుంత పరిధి, వైసాల్యం చిన్నది కావడం వల్ల ఎక్కువ నీరు ఆవిరి రూపంలో వృథాగా పోకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల భూగర్భ జలమట్టం పెరుగుతుంది.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా నీరు – చెట్టు అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చెరువుల్లో మట్టి పూడిక తీయడం, చెట్లు నాటడం లాంటి పనులు చేయాలి. దీని వల్ల వర్షపు నీటిని సంరక్షించుకోవచ్చునని ప్రభుత్వ ఉద్దేశ్యం. కానీ ఈ కార్యక్రమం సవ్యంగా జరిగిన దాఖలాలు లేవు. నీటి సంరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. విజ్ఞత గల పౌరులందరూ ఈ విషయం పై దృష్టి సారించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. నేడు ప్రపంచంలో చాలా దేశాలలోను, మరి ముఖ్యంగా భారతదేశంలో చాలా రాష్ట్రాలలోను నీటి కొరత సమస్య అధికంగా ఉంది. నీటి వనరుల పర్యవేక్షణలో ప్రజలు –ప్రభుత్వాలు సమిష్టిగా చర్యలు తీసుకొని ముందుకు సాగాలి. లేని యెడల ఈ సమస్య మరెంత జఠిలమై మానవ జీవనమే ప్రశ్నార్ధకమై పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. చైతన్యవంతమైన యువత బాద్యతగా వ్యవహించి ఈ సమస్య పరిష్కార మార్గాలను అన్వేషించే ప్రయత్నం చేయాలి.
“జలో రక్షితి రక్షతః - జలంతోనే జగతి”.
- తన్నీరు కళ్యాణ్ కుమార్, తెలుగు లెక్చరర్( తెనాలి), ఆంధ్రప్రదేశ్
About Writer
chj