1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Another decision taken on Amma vodi scheme

'అమ్మ ఒడి' పథకంపై మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం

Amma vodi
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మకంగా అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ పథకం అమలుపై సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం వర్తింపజేయాలని నిర్ణయించారు. అమ్మ ఒడి పథకంలో భాగంగా పిల్లలను బడికి పంపే ప్రతి విద్యార్థి తల్లికి రూ.15 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా ఈ పథకాన్ని ఇంటర్ విద్యార్థులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదివే విద్యార్థులకూ ఈ పథకాన్ని వర్తింపజేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పథకం అమలు తీరును అధికారులకు వివరించారు. తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ప్రతి విద్యార్థి తల్లికి రూ.15 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.
 
తాడేపల్లిలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ విద్యాశాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాఠశాల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నందున టీచర్లకు శిక్షణ అందించాలని సూచించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం గట్టి చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. 
 
యూనివర్శిటీల్లో ఉపకులపతుల ఎంపిక ప్రక్రియ కోసం తక్షణమే సెర్చ్ కమిటీలు వేయాలని, అది కూడా ఈ సాయంత్రంలోగా సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. 30 రోజుల్లోగా ఉపకులపతులను ఎంపిక చేయాలని, అలాగే వర్శిటీల్లో అన్ని ఖాళీలను ఈ ఏడాది చివరికల్లా భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
About Writer
మోహన్
తర్వాతి కథనం
సీఎం జగన్ ప్లీజ్.. ప్లీజ్ అని బ్రతిమాలినా ప్రత్యేక హోదా రాదు... పురంధేశ్వరి