ఆదివారం, 15 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 ఫిబ్రవరి 2026 (21:18 IST)

కల్తీ నెయ్యి ఉపయోగించినట్టు వైవీ సుబ్బారెడ్డే అంగీకరించారు : మంత్రి కందుల దుర్గేశ్

kandula durgesh
భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించినట్టు తితిదే మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డే స్వయంగా అంగీకరించారని ఏపీ పర్యాటక శాఖామంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించింది అసలు నెయ్యే కాదని ల్యాబ్ రిపోర్టులు ధ్రువీకరించాయని మంత్రి తెలిపారు. 
 
ఇదే అంశంపై మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గత 2019-24 మధ్య కాలంలో వైకాపా ప్రభుత్వంలోనే ఈ మహాపాపం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అయోధ్యకు పంపిన శ్రీవారి లడ్డూల విషయాన్ని ప్రస్తావిస్తూ వారే కల్తీ నెయ్యిపై నోరుజారారన్నారు. 
 
అయోధ్యకు పంపిన లడ్డూలు వేరే చోట నుంచి తెప్పించామని, వాటి తయారీలో కల్తీ జరగలేదని చెప్పడం ద్వారా తిరుమల లడ్డూప్రసాదంలో కల్తీ జరిగినట్టు వారు పరోక్షంగా అంగీకరించారని దుర్గేష్‌ ధ్వజమెత్తారు. వైకాపా నేతల మాటల్లో పొంతన లేదని, 319 రూపాయలకు నాణ్యమైన ఆవు నెయ్యి ఎక్కడి నుంచి లభిస్తుందని మంత్రి ప్రశ్నించారు. భోలే బాబా డెయిరీ కేంద్రంగానే ప్రత్యేక శ్రద్ధతో కల్తీనెయ్యి తయారుచేయించారని ఎద్దేవా చేశారు.