విద్యార్థులకు వాంతులు - విరేచనాలు - బాధ్యులపై చర్యలకు సీఎం బాబు ఆదేశం
ఏపీలోని పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరాపల్లి ఆశ్రమ బాలుర వసతిగృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ హాస్టల్‌లో బస చేస్తున్న 92 మంది విద్యార్ధులకు వాంతులు, కడుపునొప్పి, జ్వరం, డయేరియా లక్షణాలు కనిపించటంతో హుటాహుటిన మారేడుమిల్లి, రంపచోడవరం ఏరియా ఆస్పత్రులకు తరలించారు.
శనివారం ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత విద్యార్ధులు అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్టు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే హాస్టల్ తనిఖీకి వెళ్లి అక్కడి పరిస్థితులను కూడా అధ్యయనం చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హాస్టల్‌లోని మిగిలిన విద్యార్ధులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి డయేరియా లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించినట్టు చెప్పారు.
ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు ఆహార పదార్ధాల, నీటి నమూనాలు కూడా సేకరించామన్నారు. ఘటనపై విచారణ జరిపేందుకు జాయింట్ ఇన్‌స్పెక్షన్ కమిటీని కూడా నియమించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రంపచోడవరం ఏరియా అస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఎప్పటికప్పుడు విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితిపై తనకు నివేదించాలన్నారు. ఘటనపై రేపటిలోగా పూర్తి నివేదికను అందజేయాలని కలెక్టర్‌ను అదేశించారు. ఘటనకు కారకులపై శాఖా పరమైన చర్యలతో పాటు, అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు.