నారా లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. ఇంటికి నిప్పు
ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రేమేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటిని ముట్టడించిన టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు జోగి ఇంటికి నిప్పు అంటించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులను భారీగా మొహరించి, ఆందోళనకారులను అదుపులు చేస్తున్నారు.
ముఖ్యంగా, మైలవరం, విజయవాడ పశ్చిమ, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణులు ముట్టడికి వస్తున్నాయని తెలిసి జోగి రమేష్ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఆయన తండ్రి జోగి మోహనరావు, సతీమణి శకుంతల దేవి, చిన్న కుమారుడు రోహిత్ .. దాడి సమయంలో ఇంట్లోనే ఉన్నారు. దాడి సమచారం తెలుసుకుని వైకాపా శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అప్రమత్తమై ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. వైకాపా నేతలు, కార్యకర్తలు జోగి నివాసంలోకి వెళ్లగా... టీడీపీ కార్యకర్తలు ఇబ్రహీంపట్నం రింగ్ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు.
'కల్తీ మాటలతో టీడీపీ కల్తీగా మారింది. మంత్రి లోకేశ్‌కు చిప్ దెబ్బతింది. బుద్ధి తక్కువ రాజకీయాలు మానుకోవాలి. ఏడాదిన్నరలోనే రాష్ట్రాన్ని నాశనం చేశారు. తిరుపతి లడ్డూలో కల్తీ అంటూ చేసిన ప్రచారాన్ని సిట్ నిగ్గు తేల్చింది. తెదేపా నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని పూజా కార్యక్రమాలు నిర్వహించా' అంటూ జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇంకా పత్రికలో రాయలేని భాషలో లోకేశ్‌ను దూషించారు. ఇబ్రహీంపట్నం ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం పూజలు నిర్వహించిన అనంతరం జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. 'టీడీపీ కల్తీ నాయకత్వంలో నడుస్తోంది. తిరుపతి లడ్డూ కల్తీ అన్నావు, పరకామణి కేసు అన్నావు. కల్తీ మద్యం అని కేసు పెట్టావు. కల్తీ మద్యం కేసుపై మాట్లాడుకోవడానికి చంద్రబాబు, లోకేశ్ రండి. సొంత సిట్ వేసుకొని తనను జైల్లో పెట్టి రాక్షసానందం పొందారు' అంటూ పేట్రేగి మాట్లాడారు.