ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాగా, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ శనివారంతో ముగిసింది.
ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాలు మినహా మిగతా రాష్ట్రమంతటా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును ఈ నెల 7వతేది రాత్రి 10 గంటల నుంచి ఎత్తివేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతున్నందున గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి యథావిధిగా అమల్లో ఉంటుందని ఎస్‌ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బొత్స సత్తిబాబు కుమార్తెను చిత్తుగా ఓడించిన ప్రజలు
విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బొండపల్లి స్థానంలో జడ్పీటీసీ అభ్యర్థిగా వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష ఓటమి పాలయ్యారు. ఆ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పాశల నీరజ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి ఏకంగా 5136 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం గమనార్హం. ఈ గెలుపుతో బొండపల్లిలో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
బొత్స కుటుంబానికి గట్టి పట్టున్న నియోజకవర్గం కావడంతో బొత్స అనూష ఓటమి పాలవ్వడం స్థానిక రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ ఓటమి బొత్స కుటుంబానికి పెద్ద దెబ్బేనని కొందరు మాట్లాడుకుంటున్నారు.
ఎన్నికల్లో ఓటమి.. సహనం కోల్పోయిన రోజా. అసిస్టెంట్‌పై దాడి
ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోయింది. దీంతో వైకాపా నేతలు సహనం కోల్పోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి, వైకాపా నేత రోజా సహనం కోల్పోయారు. సొంత పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు.
విజయపురం మండలం ఇల్లత్తూరు ఎంపీటీసీ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రభావతి చేతిలో వైకాపా అభ్యర్థిని ఉదయగిరి దేవి మూడు ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో రీకౌంటింగ్ చేయాలంటూ రోజా కౌంటింగ్ కేంద్రం వద్ద హల్చల్ చేశారు. నగరిలోని కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చిన రోజా దాదాపు గంటపాటు ధర్నా చేశారు.
ఓ మహిళా కానిస్టేబుల్‌ను పక్కకు నెట్టేశారు. రీ కౌంటింగ్ చేయాలని పట్టుబట్టారు. ఓట్ల లెక్కింపు సక్రమంగానే జరిగిందని ఆర్వో వివరణ ఇచ్చినా ఆందోళనకు దిగారు. చివరకు పోలీసులు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త నీళ్ల సీసా అందించగా రోజా విసిరికొట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తను కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

