వైఎస్ఆర్ సమాధి సాక్షిగా వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి తేదీ వెల్లడి
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె అంజలి రెడ్డి వివాహ తేదీలను వెల్లడించారు. కడప జిల్లాలోని ఇడుపులపాయ ఎస్టేట్‌లో ఉన్న వైఎస్ఆర్ గారి ఆశీస్సులతో వివాహ తేదీని వెల్లడించారు. ఇదే అంశంపై షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో పెళ్లి తేదీలను వెల్లడించారు. 'నాన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ఆశీస్సులతో నా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిశుద్ధ వివాహ మహోత్సవం వైఎస్ఆర్ కుటుంబంలో మరో సంతోషకరమైన క్షణం. ఇరువురి కలయిక దైవ సంకల్పం. నూరేళ్ల జీవితానికి శుభారంభం.
ఈ నెల 24న నిశ్చితార్థం, నవంబరు 25వ తేదీన పరిణయం, అలాగే డిసెంబరు 5న రిసెప్షన్ వేడుక శుభవార్తను దేవుడి ఆశీర్వాదంతో నాన్న ఘాట్ వేదికగా మీతో పంచుకోవడం అత్యంత ఆనందదాయకం. కాబోయే నూతన వధూవరుల దాంపత్య జీవితం కన్నుల పండుగగా, సుఖసంతోషాలతో సాగాలని, అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డిల తొలి వివాహ ఆహ్వాన పత్రికను నా కుటుంబ సభ్యులతో, రఘురామ్ తల్లిదండ్రులతో కలిసి ఇడుపులపాయలోని నాన్న వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. నాన్న దీవెనలు బిడ్డల జీవితాలకు కొండంత అండ. ఆయన చూపిన సన్మార్గం వారికి ఎల్లప్పుడూ ఆదర్శప్రాయం అని వైఎస్ షర్మిల చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.

