1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. EPFO warns members against fake weblinks

ఈపీఎఫ్ఓ చందాదారులకు హెచ్చరిక... నకిలీ వెబ్‌సైట్లతో జర జాగ్రత్త...

EPFO
ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తమ చందాదారులకు కీలక సూచనలు చేసింది. ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ఓ సేవలు పొందే క్రమంలో నకిలీ వెబ్‌సైట్ల బారిన పడొద్దని సూచించింది. వినియోగదారుల సున్నిత సమాచారాన్ని తస్కరించేందుకు అధికారిక వెబ్‌సైట్‌లను పోలి ఉండే నకిలీ లింక్‌లను సైబర్‌ నేరగాళ్లు సృష్టిస్తున్నారని తెలిపింది. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎక్స్‌ వేదికగా పేర్కొంది. వ్యక్తిగత సమాచారాన్ని ప్రమాదంలో పడేసే నకిలీ లింకులు, ఈ-మెయిల్స్‌ను క్లిక్‌ చేయొద్దని కోరింది.
 
ఈపీఎఫ్‌ఓ ఇటీవల సిస్టమ్‌ అప్‌గ్రెడేషన్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ ఈపీఎఫ్‌ఓ సేవల వినియోగం పెరిగింది. ఇదే అదనుగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్న వేళ.. ఈపీఎఫ్‌ఓ తమ చందాదారులకు ఈ విజ్ఞప్తి చేసింది. సైబర్‌ నేరాల బారిన పడకుండా ఉండేందుకు 6 సూచనలు చేసింది. అధికారిక వెబ్‌సైట్‌ లింకులనూ పంచుకుంది.
 
అధికారిక ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌ను మాత్రమే సందర్శించాలని, సామాజిక మాధ్యమాలు, ఎస్‌ఎమ్‌ఎస్‌ లేదా ఈ-మెయిల్‌లో వచ్చే అనుమానాస్పద వెబ్‌సైట్‌ లింక్‌లను క్లిక్‌ చేయొద్దని కోరింది. అధికారిక వెబ్‌సైట్‌లో కాకుండా ఇతర ఏ ప్లాట్‌ఫామ్‌లో యూఏఎన్, పీపీఓ, పాస్‌వర్డ్‌, ఆధార్‌, పాన్‌, బ్యాంక్‌ వివరాలు, ఓటీపీలను నమోదు చేయొద్దని, అకౌంట్‌ లాగిన్ అయ్యే ముందు సైట్ యూఆర్‌ఎల్‌ స్పెల్లింగ్‌ లేదా డొమైన్‌ పేర్లను తనిఖీ చేయాలని కోరింది. అనుమానాస్పద మెసేజ్‌లు వచ్చినప్పుడు వెంటనే ఈపీఎఫ్‌ఓ హెల్ప్‌డెస్క్‌ లేదా సైబర్‌ సెక్యూరిటీకి రిపోర్ట్‌ చేయాలని సూచించింది. అలాగే, ఫోన్‌‌కాల్స్, వాట్సప్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌ లేదా ఈ-మెయిల్ ద్వారా ఈపీఎఫ్‌ఓ ఎలాంటి ఓటీపీలు గానీ, లాగిన్‌ వివరాలు గానీ అడగదనే విషయాన్ని ప్రతి ఒక్క చందాదారుడు గుర్తుంచుకోవాలని కోరింది. 
 
అధికారిక వెబ్‌సైట్ లింకులు ఇవే..
https://www.epfindia.gov.in
https://www.epfo.gov.in
https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
పంటపొలంలో రూ.5లక్షలను పాలిథిన్ సంచిలో వుంచి పాతిపెట్టిన రైతు... చివరికి? (Video)