బంగారం దిగుమతులపై ఐజీఎస్టీ మినహాయింపా? కేంద్రం కీలక నిర్ణయం?
దేశంలో బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు బంగారు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. బ్యాంకులు, ప్రభుత్వం గుర్తించిన నామినేటెడ్ ఏజెన్సీలు దిగుమతి చేసుకునే బంగారం, వెండి, ప్లాటినంపై ప్రస్తుతం ఉన్న ఐజీఎస్టీ మినహాయింపును తొలగించే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించనుంది. అక్టోబరు 7వ తేదీన జరిగే సమావేశంలో దీనిపై చర్చించే ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
బంగారం, వెండి దిగుమతులు దేశానికి ఆందోళన కలిగించే అంశంగా మారాయి. వీటి కోసం భారీగా విదేశీ మారకం బయటకు వెళుతుంది. ఫలితంగా విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. చైనా తర్వాత ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశం భారత్. దేశంలో బంగారం దిగుమతులకు ప్రధాన కారణం ఆభరణాల పరిశ్రమ డిమాండ్.
ఇటీవలే బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని ఆరు శాతం నుంచి 15 శాతానికి పెంచారు. ప్లాటినంపై సుంకాన్ని 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచారు. అవసరం లేని దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - ఆగస్టు మధ్య బంగారం దిగుమతులు 3.38 శాతం పెరిగి 17.47 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదేసమయంలో వెండి దిగుమతులు 8.81 శాతం తగ్గి 1.74 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
అయితే, ప్రస్తుతం బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై మూడు శాతం ఐజీఎస్టీ ఉంది. అయితే బ్యాంకులు, ప్రభుత్వం గుర్తించిన నామినేటెడ్ ఏజెన్సీలు దిగుమతి చేసే విలువైన లోహాలకు ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంది. ఈ సౌకర్యాన్ని 2017లో తీసుకొచ్చారు. అప్పట్లో విలువైన లోహాల దిగుమతులు కొన్ని మార్గాల ద్వారానే జరిగేవి.
వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితులు మారడంతో ఈ మినహాయింపును తొలగించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. నిర్ణయం అమల్లోకి వస్తే బులియన్ ఎక్స్ఛేంజీలు, నామినేటెడ్ ఏజెన్సీలకు పన్ను విషయంలో సమాన పరిస్థితి ఏర్పడుతుంది.

