సరైన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటా : నిత్యా మేనన్
తాను పెళ్లి చేసుకోనని ఎన్నడూ చెప్పలేదని, నా మనస్సుకు సరైన వ్యక్తి తారసపడితే వివాహం చేసుకుంటానని ప్రముఖ హీరోయిన్ నిత్యా మేనన్ అన్నారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆమె వెల్లడించారు. తనకు పెళ్లి కంటే ఎక్కువగా సరైన బంధానికే ప్రాధాన్యమిస్తానని తెలిపారు.
'నేను పెళ్లి చేసుకోను అని చెప్పినప్పుడు.. పెళ్లికి వ్యతిరేకమని, అసలు చేసుకోవాలనే లేదని అందరూ భావించారు. కానీ, నా ఉద్దేశం అది కాదు. నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. అయితే ఎలాంటి వ్యక్తి కావాలి? బంధం ఎలా ఉండాలి? అనే విషయంలో నాకో స్పష్టత ఉంది. నా లక్ష్యం పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు.. సరైన వ్యక్తితో సరైన బంధాన్ని ఏర్పరచుకోవడం అని ఆమె స్పష్టం చేశారు.
'నాకు సవాళ్లు ఎదురైనప్పుడే కొత్త విషయాలు నేర్చుకోగలను. చిన్నప్పటి నుంచీ ఎవరైనా నన్ను తదేకంగా చూస్తే వెళ్లిపోమని చెప్పేదాన్ని. నాకు సిగ్గు ఎక్కువ. అందరి ముందూ కనిపించడం అంతగా ఇష్టం ఉండదు. ఇబ్బందిగా అనిపిస్తుంది. అదొక సవాలు లాంటిది. ఎందుకు అసౌకర్యంగా అనిపిస్తోంది? దాని వెనుక కారణమేంటి? అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. అది మనల్ని మనం అంచనా వేసుకునే విధానానికి సంబంధించిన విషయమని అనిపిస్తుంది' అని ఆమె తెలిపారు.

