విటమిన్ డి లోపంతో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి?
విటమిన్ డి శరీరంలో క్యాల్షియం, ఫాస్పరస్‌లను గ్రహించడానికి సహాయపడుతుంది. దీని లోపం వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు రోగనిరోధక శక్తి తగ్గుతుంది. విటమిన్ డి లోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటంటే.... ఎముకలు బలహీనపడి తరచూ నడుము, వెన్ను, కీళ్ల నొప్పులు వస్తాయి. పెద్దలలో ఎముకలు మెత్తబడి విరిగే ప్రమాదం (ఆస్టియోమలాసియా) పెరుగుతుంది. పిల్లలలో ఎముకలు వంగిపోవడం (రికెట్స్) జరుగుతుంది.
కండరాలు పట్టేయడం, నడవడంలో లేదా మెట్లు ఎక్కేటప్పుడు బలహీనంగా అనిపించడం. తగినంత నిద్ర పోయినా రోజంతా నీరసంగా, అలసటగా ఉండటం. తరచూ జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడటం, గాయాలు త్వరగా మానకపోవడం. నిరాశ, ఆందోళన, మూడ్ స్వింగ్స్ కనిపించడం. తీవ్రమైన విటమిన్ డి లోపం ఉన్నప్పుడు జుట్టు విపరీతంగా రాలే అవకాశం ఉంటుంది.
విటమిన్ డి లభించే ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. సూర్యరశ్మి ప్రధాన వనరు. ఉదయం 7 గంటల నుండి 10 గంటల మధ్య ఎండలో 15 నుండి 20 నిమిషాలు గడపడం వల్ల చర్మం సహజంగా విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. సాల్మన్, ట్యూనా వంటి చేపలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్ ఉంటే, పచ్చసొనలో విటమిన్ డి ఉంటుంది.
ముఖ్యంగా ఎండలో పెరిగిన లేదా UV కిరణాలకు గురైన పుట్టగొడుగులలో విటమిన్ డి2 లభిస్తుంది. శాఖాహారులకు ఇది ఉత్తమ ఎంపిక. అదనంగా విటమిన్ డి కలిపి తయారు చేసిన ఆవు పాలు, సోయా పాలు, బాదం పాలు, పెరుగు, ఓట్స్, కొన్ని రకాల తృణధాన్యాలు, ఆరెంజ్ జ్యూస్. వెన్న, చీజ్ (జున్ను), మరియు మేక లేదా కోడి కాలేయంలో కొద్ది మొత్తంలో విటమిన్ డి ఉంటుంది.

