1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. UPI Payments Above Rs.2,000: MDR Charges Deferred Until After Diwali

దీపావళి పండుగ తర్వాత ఎండీఆర్ వసూలు : కేంద్రం

cash
దీపావళి పండుగ తర్వాత మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) చార్జీల అమలు ప్రారంభమవుతుందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు వ్యాపారులకు, వినియోగదారులకు జతీయ చెల్లింపుల కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. అక్టోబరు 15వ తేదీ నుంచి అమల్లోకి రావాల్సిన ఈ చార్జీలను దీపావళి తర్వాతే అమలు చేస్తామని స్పష్టం చేసింది. 
 
పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్పీసీఐ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. వ్యాపారుల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని, వారికి ఊరట కల్పించే ఉద్దేశంతో ఈ వాయిదా వేసినట్లు పేర్కొంది. ఛార్జీల అమలుకు సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ ఏడాది దీపావళి పండుగ నవంబరు 8న రానుంది.
 
సెప్టెంబరు 15న ఎన్‌పీసీఐ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. రూ.2,000 మించిన ఎంపిక చేసిన పర్సన్-టు-మర్చంట్ (పీ2ఎం) లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీ విధించాల్సి ఉంది. దీనిపై గరిష్ఠంగా రూ.300 పరిమితి విధించారు. అయితే, ఈ ఛార్జీలను వ్యాపారులు మాత్రమే చెల్లించాలి, వినియోగదారులపై ఎలాంటి భారం పడదు. రూ.2,000 లోపు లావాదేవీలు, వ్యక్తుల మధ్య (పీ2పీ) జరిగే చెల్లింపులు, చిన్న వ్యాపారులకు పూర్తి మినహాయింపు ఉంటుంది. రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం, విద్య వంటి కొన్ని కేటగిరీలలో రూ.2,000 దాటిన చెల్లింపులపై ఫ్లాట్‌గా రూ.5 ఛార్జీని మాత్రమే ప్రతిపాదించారు. 
 
పండుగల సీజనులో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అమ్మకాలు భారీగా ఉంటాయి. ఈ సమయంలో ఛార్జీలు విధిస్తే వ్యాపారంపై ప్రభావం పడుతుందని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ వంటి పలు వ్యాపార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ, వాయిదా కోరాయి. ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఎన్‌పీసీఐ తాజా నిర్ణయం తీసుకుంది. కొత్త తేదీ ప్రకటించే వరకు యూపీఐ లావాదేవీలు యథాతథంగా కొనసాగుతాయి. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మున్సిపల్ చైర్ పర్సన్ పదవి కోసం రాత్రికి రాత్రే వివాహం - చర్చకు దారితీసిన పెళ్లి