ఆదాయపన్ను రిటర్ను ఎప్పటి లోగా దాఖలు చేయాలి... జూలై ఒకటి నుంచి వచ్చే రూల్స్ ఏంటి?
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు జులై 31 లోపు దాఖలు చేయాల్సివుంటుంది. ఐటీఆర్-1, ఐటీఆర్-2 దాఖలు చేసే వారికి ఈ గడువు వర్తిస్తుంది. ఆలస్యమైతే జరిమానా పడే అవకాశం ఉందని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, మరికొన్ని పన్ను ప్రయోజనాలు కూడా కోల్పోవచ్చు. కాబట్టి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే రిటర్నులు దాఖలు చేయడం మంచిది.
ముఖ్యంగా, ఆధార్ వినియోగదారులకు ఇది శుభవార్త. ఆధార్ నమోదైన ఈ-మెయిల్ చిరునామాను మార్చుకోవడానికి ఇకపై రూ.75 చెల్లించాల్సిన అవసరం లేదు. ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఈ సేవను ఉచితంగా పొందవచ్చు. ఈ సదుపాయం 2026 డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.
ఫోన్ పే, ఎస్.బి.ఐ క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్ల విధానంలో మార్పులు వస్తున్నాయి. కొన్ని లావాదేవీలపై ఇకపై రివార్డు పాయింట్లు ఇవ్వరు. అలాగే ఖర్చులు నిర్దేశిత పరిమితి దాటితేనే పాయింట్లు లభిస్తాయి. ఈ మార్పులు ఎంపిక చేసిన కార్డులకు మాత్రమే వర్తిస్తాయి.
హెచ్.డి.ఎఫ్.సి క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎయిర్ పోర్టు లాంజ్ సదుపాయంపై కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. ఒక త్రైమాసికంలో మూడు ఉచిత లాంజ్ సందర్శనలు పొందాలంటే.. అంతకుముందు త్రైమాసికంలో కనీసం రూ.60 వేలు ఖర్చు చేసి ఉండాలి.
జులై 1 నుంచి పాస్ పోర్టు ఫీజులు పెరగనున్నాయి. సాధారణ, తత్కాల్ పాస్ పోర్టర్లకు కొత్త రుసుములు అమల్లోకి వస్తాయి. దేశీయంగా, విదేశాల్లో దరఖాస్తు చేసుకునే వారందరికీ ఈ మార్పులు వర్తిస్తాయి.
బ్యాంకులు అవసరం లేని బీమా, పెట్టుబడి ఉత్పత్తులను బలవంతంగా విక్రయించకుండా ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. జులై 1 నుంచే ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. కస్టమర్ల ప్రయోజనాలను కాపాడడమే దీని ఉద్దేశం.
