సంబంధిత వార్తలు
చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త ఆధార్ నిబంధనలు.. ఎక్కడ?
దేశ వ్యాప్తంగా ఆధార్ కార్డు జారీలో ఒకే రకమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. కానీ, అస్సాం రాష్ట్రంలో కొత్త నిబంధనలను ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. తమ రాష్ట్రంలోని అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు వీలుగా 18 యేళ్లు నిండిన తర్వాత కొత్త ఆధార్ కార్డులను జారీని నిలిపివేసింది. కొన్ని జిల్లాల్లో 100 శాతం మించి ఆధార్ నమోదు కావడంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు సందేహం వచ్చింది. దీంతో 18 యేళ్లు నిండిన వారికి ఆధార్ కార్డును జారీ చేయొద్దని అధికారులను ఆదేశించారు.
ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధాన కారణం లేకపోలేదు. బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ వలసదారులు ఆధార్ కార్డులు పొందకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. శనివారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో జనాభా కంటే అధికంగా, అంటే 100 శాతానికి మించి ఆధార్ కార్డులు అయినట్లు గుర్తించామని, ఈ అదనపు కార్డులు ఎవరికి జారీ అయ్యాయో నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అక్రమ చొరబాటుదారులు ఆధార్ పొందకుండా కట్టడి చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని సీఎం వివరించారు.
అయితే, అత్యవసర పరిస్థితుల్లో అర్హులైన వారు ఆధార్ పొందేందుకు ప్రత్యేక నిబంధనలను రూపొందించారు. దీని ప్రకారం, జిల్లా కలెక్టర్ సంబంధిత వ్యక్తి వివరాలను సిఫార్సు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. కాగా, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), మరియు టీ గార్డెన్ కమ్యూనిటీలకు చెందిన వారికి మార్చి 31, 2027 వరకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. 18 ఏళ్లు పైబడిన వారికి కొత్త ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేసినప్పటికీ, 18 ఏళ్లలోపు చిన్నారులకు ఆధార్ నమోదు యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
