1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Rohit Sharma becomes first player to hit 4 T20 international centuries

లక్నో ట్వంటీ20 : రోహిత్ ధమాకా... భారత్‌దే టీ20 సిరీస్‌

Rohit Sharma
లక్నో వేదికగా పర్యాటక వెస్టిండీస్ జట్టుతో జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు విజయభేరీ మోగించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరోమారు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫలితంగా కేవలం 61 బంతుల్లో 7 సిక్స్‌లు, 8 ఫోర్ల సాయంతో 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే, బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థిని కట్టడి చేయడంతో వెస్టిండీస్‌తో రెండో టీ20లోనూ భారత్‌ 71 పరుగులతో జయభేరి మోగించింది. ఫలితంగా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 195/2 చేసింది. ఛేదనలో విండీస్‌ 20 ఓవర్లలో 124/9కే పరిమితమైంది. 130 పరుగులు చేస్తే గొప్ప అని భావించిన పిచ్‌పై రోహిత్ మ్యాన్‌ ఒక్కడే అజేయంగా 111 పరుగులు చేశాడు. ఇక అతను ఆ స్థాయిలో ఆడాడంటే చెప్పేదేముంది.. దాదాపు పాతికేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ను చూసిన లక్నో ప్రేక్షకులకు ఒక రోజు ముందే పరుగుల టపాసులతో దీపావళిని జరిపేసుకున్నట్టయింది. 
 
ప్రస్తుతం భారత్‌ 2-0 ఆధిక్యంలో ఉండగా చివరిదైన మూడో టీ20 ఈ ఆదివారం చెన్నైలో జరుగుతుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. శిఖర్‌ ధవన్‌ (41 బంతుల్లో 3 ఫోర్లతో 43), రాహుల్‌ (14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 26 నాటౌట్‌) రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులు చేసి ఓడింది. కుల్దీప్, ఖలీల్‌ అహ్మద్‌, బుమ్రా, భువనేశ్వర్‌ రెండేసి వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రోహిత్ శర్మకు దక్కింది.
తర్వాతి కథనం
ట్వంటీ-20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన పాకిస్థాన్‌