శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 అక్టోబరు 2018 (10:28 IST)

వెస్టిండీస్ బౌలర్లను చితక్కొట్టారు.. సెంచరీల మోత... భారత్ విజయం

ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ ఆరంభం అదిరిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ (140), రోహిత్ శర్మ (152 నాటౌట్)లు సెంచరీలతో కదం తొక్కడంతో టీమిండియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 322 భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 326 పరుగులు చేసి గెలుపొందింది. ఫలితంగా ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ షిమ్రన్‌ హెట్‌ మయెర్‌ (78 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 106) శతకం బాదగా కీరన్‌ పావెల్‌ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 51) అర్థ సెంచరీ సాధించాడు. ఫలితంగా విండీస్ జట్టు భారీ స్కోరు చేసింది. భారత బౌలర్లలో స్పిన్నర్‌ చాహల్‌కు మూడు, జడేజా.. షమిలకు రెండేసి వికెట్లు దక్కాయి.
 
ఆ తర్వాత 323 పరుగుల భారీ లక్ష్యం కోసం ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ ప్రత్యర్థి బౌలింగ్‌ను ఆటాడుకుంది. రెండో ఓవర్‌లోనే పేసర్‌ థామస్‌ బుల్లెట్‌లాంటి బంతికి ఓపెనర్‌ ధవన్‌ (4) వికెట్‌‌ను భారత్‌ కోల్పోయింది. ఈ సంతోషం కోహ్లీ రాకతో విండీస్‌కు ఆవిరైంది. రోహిత్‌తో కలిసి తను తుఫాన్‌ వేగంతో స్కోరును పరిగెత్తించాడు. విండీస్‌ బౌలర్లలో ఎలాంటి వైవిధ్యం కనిపించకపోవడంతో ఫ్లాట్‌ వికెట్‌పై ఈ జోడీ పరుగుల పండగ చేసుకుంది. 
 
బంతి పడిందే ఆలస్యం బౌండరీ ఆవల ఉండాల్సిందే అన్నట్టుగా వీరి దూకుడు సాగింది. థామస్‌ వేసిన ఆరో ఓవర్‌లో కోహ్లీ రెండు ఫోర్లు.. రోహిత్‌ సిక్సర్‌ బాదాడు. అతడి మరుసటి ఓవర్‌లో కోహ్లీ మరో రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత హోల్డర్‌ బౌలింగ్‌లోనూ ఇదే రీతిన చెలరేగడంతో 35 బంతుల్లోనే కోహ్లీ అర్థ సెంచరీ పూర్తి కాగా జట్టు 15.1 ఓవర్లలోనే వంద పరుగులు ధాటింది. 
 
ఆ తర్వాత రోహిత్ వంతువచ్చింది. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన రోహిత్‌ కూడా బ్యాట్‌ ఝుళిపిస్తూ 21వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు సాధించడంతో 51 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు కోహ్లీ ఏమాత్రం జోరు తగ్గించక 88 బంతుల్లో 36వ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత అతడు మరింతగా విజృంభించగా పరుగులు ధారాళంగా వచ్చాయి. 29వ ఓవర్‌లో కోహ్లీ 6,4.. రోహిత్‌ 4,4 బాదగా 19 రన్స్‌ వచ్చాయి. 
 
మరోవైపు 32వ ఓవర్‌లో రోహిత్‌ సిక్సర్‌, ఫోర్‌ బాది 84 బంతుల్లో విండీస్‌‌పై తొలి.. కెరీర్‌లో 20వ శతకం పూర్తి చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో కోహ్లీ (140) సూపర్‌ ఇన్నింగ్స్‌కు బ్రేక్‌ పడింది. బిషూ బంతిని డిఫెన్స్‌ ఆడబోయి స్టంపయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 246 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. అప్పటికి విజయానికి మరో 67 పరుగులు చేయాల్సి ఉండగా రాయుడు (22 నాటౌట్‌)తో కలిసి రోహిత్‌ గెలుపు ఖాయం చేశాడు. తన చివరి ఐదు బంతుల్లో రోహిత్‌ మూడు ఫోర్లు, ఓ సిక్స్‌ కొట్టగా మరో 47 బంతులుండగానే మ్యాచ్‌ ముగిసింది.