వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను కట్టుకున్న భార్య తన ప్రియుడితో కలిసి చంపేసింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఒరిస్సాకు చెందిన నారాయణ బెహరా (32), బధిత బెహరా (27)లు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరేళ్ల కుమార్తె కూడా ఉంది. ఓల్డ్ మీర్‌పేట్ శాంతినగర్‌లో కాపురం ఉంటున్నారు. నారాయణ ప్లంబర్‌గా పని చేస్తుంటే, బంధిత ఎన్.ఎఫ్.సి కంపెనీలో స్వీపర్‌గా పని చేస్తోంది.
ఈ క్రమంలో బీహార్ రాష్ట్రానికి చెందిన విద్యాసాగర్ (25) అనే వ్యక్తి ఇల్లు బంధిత ఇంటి పక్కపక్కనే ఉండటంతో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలిసి భార్యను నిలదీసింది. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అయితే, తమ బంధానికి భర్త అడ్డుగా ఉండటాన్ని జీర్ణించుకోలేక పోయిన భార్య... తన ప్రియుడు సాయంతో చంపేందుకు ప్లాన్ చేసింది.
తమ పథకంలో భాగంగా, గురువారం రాత్రి నారాయణ, విద్యాసాగర్ కలిసి మల్లాపూర్‌లోని వైన్స్ షాపులో మద్యం సేవించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అర్థరాత్రి సమయంలో ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక నారాయణ, బంధితలకు గొడవ జరిగింది. దీంతో బంధిత ప్రియుడితో కలిసి ఇనుపరాడ్డుతో భర్తను తలపై కొట్టడంతో మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. తొలుత అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెల్లడైంది. దీంతో బంధితతో పాటు ఆమె ప్రియుడు విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
