గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 డిశెంబరు 2025 (09:22 IST)

14 యేళ్ల బాలికపై పెంపుడు తండ్రి, బావమరిది అత్యాచారం.. ఎక్కడ?

rape victim
ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో దారుణం జరిగింది. 14 యేళ్ల బాలికపై పెంపుడు తండ్రి, అతని బావమరిది కలిసి నెలల తరబడి అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు. చివరకు ఆ బాలిక అస్వస్థతకు గురైంది. దీంతో ఆ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి గర్భందాల్చినట్టు నిర్ధారించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానిక పోలీసులు స్పందించి ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ధర్మవరానికి చెందిన దంపతులు 14 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద ఓ ఆడ శిశువును దత్తత తీసుకుంది. అప్పటి నుంచి ఆ బాలికను సొంత కూతురిలా పెంచుకుంటున్నారు. అయితే, ఇటీవల పెంపుడు తండ్రి, అతని బావమరిది బాలికపై కన్నేశారు. బెదిరింపులకు గురిచేస్తూ కొన్ని నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో బాలిక మౌనంగా ఉండిపోయింది.
 
ఆదివారం బాలిక అస్వస్థతకు గురికావడంతో, పెంపుడు తల్లి ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షలు నిర్వహించి, బాలిక ఐదు నెలల గర్భవతి అని నిర్ధారించారు. దీంతో ఆ తల్లి దిగ్భ్రాంతికి గురైంది. తన సోదరుడే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అనుమానించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ హేమంత్ కుమార్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. పెంపుడు తండ్రితో పాటు అతని బావమరిది కూడా తనపై అత్యాచారం చేశారని బాలిక వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు.