రాప్తాడు నిందితుడిపై పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు, వీడియో
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా రాప్తాడు నిందితుడు హేమంత్ పైన పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. విద్యార్థినిపై పాశవిక దాడి చేసిన తర్వాత అతడు పరారయ్యాడు. అనంతపురం జిల్లా ఆత్మకూరు వద్ద అడవిలో హేమంత్ దాక్కున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లారు. పోలీసులను చూసిన అతడు వారిపైకి రాళ్లతో దాడికి దిగి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. దాంతో అతడిపై పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం.
కాగా నిందితుడు హేమంత్.. రాప్తాడు మండలంలో జిల్లాపరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై క్లాస్ రూంలోనే చెట్లు కోసే రంపంతో అత్యంత క్రూరంగా దాడి చేసిన సంగతి తెలిసిందే.
బ్రేకింగ్ న్యూస్ రాప్తాడు నిందితుడు హేమంత్పై ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు హేమంత్ చనిపోయినట్లు సమాచారం.. ఇంకా అధికారికంగా ధృవీకరించని పోలీసులు అనంతపురం జిల్లా ఆత్మకూరు వద్ద అడవిలో హేమంత్ దాచుకున్నట్లు సమాచారం వచ్చి వెళ్లిన పోలీసులు పోలీసులను చూసి రాళ్లతో దాడి చేసి పారిపోయిన హేమంత్ హేమంత్పై పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిపై చెట్లు కట్ చేసే మెషిన్‌తో అత్యంత కిరాతకంగా దాడి చేసిన హేమంత్
— Telugu Scribe (@TeluguScribe) November 1, 2026
గాయపడిన విద్యార్థినికి లోకేష్ పరామర్శ
ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో దుండగుడి దాడిలో అత్యంత దారుణంగా గాయపడిన పదో తరగతి విద్యార్థినిని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించిన బాలికను ఆయన ఆదివారం స్వయంగా వెళ్లి చూశారు.
బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, బాలిక సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకునే వరకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, "రాప్తాడులో జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరం, బాధాకరం. ఇలాంటివి జరగాల్సింది కాదు. విషయం తెలిసిన వెంటనే పోలీసు, ఆరోగ్య శాఖలను అప్రమత్తం చేశాను. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు దాదాపు 8 గంటల పాటు శ్రమించి బాలికను విషమ పరిస్థితి నుంచి గట్టెక్కించారు.
ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించాం. ఇక్కడకు తీసుకువచ్చిన వెంటనే వైద్య బృందం స్పందించి దాదాపు 12 గంటల పాటు సుదీర్ఘమైన శస్త్రచికిత్స నిర్వహించింది. ప్రస్తుతం బాలికను ఐసీయూకి తరలించారు. రాబోయే 48 గంటలు చాలా కీలకం. మనందరి ప్రార్థనలు ఆ బిడ్డకు ఎంతో అవసరం. ఆమె మన బిడ్డ, మనందరి మద్దతుతో సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి" అని లోకేశ్ ఆకాంక్షించారు.
ఈ ఘటనపై ప్రభుత్వం చాలా తీవ్రంగా స్పందించిందని లోకేశ్ స్పష్టం చేశారు. "పాఠశాలలో 'భవిత' సెంటర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ నిర్మాణ పనులకు వచ్చే కార్మికుడి ముసుగులో దుండగుడు పాఠశాలలోకి ప్రవేశించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇది ఖచ్చితంగా భద్రతా లోపమే. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఘటనకు ముందు అతడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అతడిని త్వరలోనే పట్టుకుంటాం. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తాం" అని ఆయన గట్టిగా చెప్పారు.

