కుమార్తెతో సన్నిహితంగా ఉంటున్నాడనీ యువకుడిని చంపి ముక్కలు చేసిన దంపతులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్కాపురం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని యర్రగొండపాలెంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తమ కుమార్తెతో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని భార్యాభర్తలు ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ యువకుడుని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి బోరుబావిలో పడేసినట్టు పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
మృతుడుని ఆంజనేయులుగా గుర్తించారు. ఈ నెల 13వ తేదీన కనిపించకుండా పోయాడు. దీనిపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్య చేసిన దంపతులను నారాయణ, రవణ దంపతులుగా గుర్తించారు.
తమ కుమార్తెతో ఆ యువకుడు సన్నిహితంగా ఉండటం చూసి భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో నిందితులు అంగీకరించారు. దంపతులిద్దరినీ యర్రగొండపాలెం పోలీసులు అదుపులోకి తీసుకుని ఈ ఘాతుకంపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. మృతదేహం ముక్కలను బోరు బావిలో పడేయడంతో వాటిని తీయడం కష్టసాధ్యంగా మారింది.
