ఓ ఇంటర్వ్యూ పాత పగను రగిల్చింది... మాజీ నక్సలైట్‌ను హత్య
తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. మాజీ నక్సలైట్ ఒకరు ఒక యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ అతని హత్యకు కారణమైంది. ఈ మాజీ నక్సలైట్‌ను ఓ యువకుడు హత్య చేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
సిరిసిల్ల జిల్లా వేములవాడ తంగళ్ళపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన బల్లెపు సిద్ధయ్య అలియాస్ నర్సయ్య గతంలో ఓ నక్సలైట్‌గా పనిచేశాడు. కొద్ది కాలం క్రితం ఆయన ఓ యూట్యూబ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తాని అజ్ఞాతంలో ఉన్న సమయంలో పలువురుని హతమార్చినట్టు చెబుతూ తాను చంపేసిన వారి పేర్లను కూడా వెల్లడించారు.
ఈ ఇంటర్వ్యూను జగిత్యాల జిల్లాకు చెందిన సంతోష్ అనే యువకుడు చూశాడు. తన తండ్రిని చంపింది నర్సయ్యేనని ఆ వీడియో ద్వారా నిర్ధారించుకున్నాడు. దీంతో నర్సయ్యపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన పథకంలో భాగంగా వేములవాడ అర్బన్ మండలం, అగ్రహారం గుట్టల్లోకి పిలిపించి దారుణంగా హతమార్చాడు.
ఆ తర్వాత నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కేవలం ఒక ఇంటర్వ్యూ పాత పగను రగిల్చి హత్యకు దారితీయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.