శనివారం, 29 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2025 (09:33 IST)

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

nallakunta lake
హైదరాబాద్ కూకట్ పల్లి నల్ల చెరువు వద్ద ఆక్రమణలను తొలగించలేదని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హైడ్రా) స్పష్టం చేసింది. చెరువు భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, పేదల గుడిసెలంటూ తప్పుడు ప్రచారం చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించింది. ఈ ఆక్రమణల తొలగింపుపై వస్తున్న ఆరోపణలపై హైడ్రా అధికారులు వివరణ ఇచ్చారు. 
 
చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్ఎల్) పరిధిలోకి వచ్చే సర్వే నంబర్ 176లో చెత్త సేకరించేవారు, స్క్రాప్ వ్యాపారులు తాత్కాలిక షెడ్లు వేసుకున్నారు. చెరువు ప్రాంతాన్ని ఖాళీ చేయాలని వారిని కోరగా, రెండు మూడు రోజుల క్రితమే వారు స్వచ్ఛందంగా తమ షెడ్లను తొలగించుకుని వెళ్లిపోయారు. అయితే, ఈ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న కొందరు కబ్జాదారులు.. సర్వే నంబర్ 180 పేరుతో ఇప్పుడు కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు.
 
గతంలో ఇక్కడ ఉన్నవారి నుంచి అద్దెలు వసూలు చేసిన వారే, ఇప్పుడు వారిని అడ్డం పెట్టుకుని భూమిని కొట్టేయాలని చూస్తున్నారని హైడ్రా ఆరోపించింది. ఈ వ్యవహారంపై కొందరు హైకోర్టును కూడా ఆశ్రయించి, సర్వే నంబర్ 180 కింద తమకు నష్టపరిహారం కావాలని కోరారు. అయితే, తాము ఖాళీ చేయిస్తున్నది సర్వే నంబర్ 176 అని, చెరువులో చెత్త వేయడం వల్ల నీరు కలుషితమవుతోందని హైడ్రా కోర్టుకు వివరించింది.
 
దీనిపై స్పందించిన న్యాయస్థానం.. సర్వే నంబర్లను సరిచూసి, నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించాలని సూచించినట్లు అధికారులు తెలిపారు. అసలైన నివాసితులు వెళ్లిపోయిన తర్వాత, కబ్జాదారులు చేస్తున్న చివరి ప్రయత్నమే ఈ గందరగోళమని హైడ్రా స్పష్టం చేసింది.