మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు గోవాలో అరుదైన గౌరవం లభించింది. నటుడిగా 50 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోవాలో జరిగిన 56వ అతంర్జాతీయ చిత్రోత్సవ వేడుకల ముగింపు వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా రజనీకాంత్‌ను సత్కరించారు.
కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ శాలువాతో రజనీకాంత్‌ను సత్కరించి, జ్ఞాపిక అందించారు. అనంతరం రజనీకాంత్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 'నటుడిగా 50 ఏళ్ల నా ప్రయాణాన్ని తలచుకుంటే.. పదేళ్లో, పదిహేనేళ్లో గడిచినట్లుగా అనిపిస్తోంది. ఒకవేళ మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా' అని పేర్కొన్నారు.
గోవా వేదికగా జరిగిన 'ఇఫి' వేడుకకు కుటుంబంతో కలిసి రజనీకాంత్ హాజరయ్యారు. ఈ ఫ్యామిలీ ఫొటో నెట్టింట అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తొమ్మిది రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో 13 వరల్డ్ ప్రీమియర్స్, 5 ఇంటర్నేషనల్ ప్రీమియర్స్, 44 ఏషియన్ ప్రీమియర్స్ ప్రదర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఉత్తమ పరిచయ దర్శకుడు కేటగిరీలో బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ సింగ్ త్యాగి (కేసరి ఛాప్టర్ 2)కి అవార్డు దక్కింది. ఈ నెల 20న ప్రారంభమైన 56వ 'ఇఫి' ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణను సత్కరించిన సంగతి తెలిసిందే. బాలయ్య కూడా నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.