మోసం చేసిన ప్రియురాలు.. ఆత్మహత్య చేసుకున్న ఇన్ఫోసిస్ టెక్కీ
హైదరాబాద్ నగరంలో ఓ టెక్కీ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రియురాలు మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో పని చేస్తుడటం గమనార్హం. మృతుడుని పవన్ కళ్యాణ్ రెడ్డి (26)గా గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్ఫోసిస్ కంపెనీలో పని చేస్తూ, తన ఇంట్లోనే ఉరేసుకున్నాడు.
గుంటూరు జిల్లాకు చెందిన పవన్... పోచారంలోని కల్చరల్ టౌన్‌షిప్‍లో తన స్నేహితులతో కలిసి అద్దె ఇంట్లో గత నాలుగేళ్ళుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఓ యువతిని ప్రేమించాడు. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చి శారీరకంగా దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఆ యువతి గత కొన్ని రోజులుగా మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయిన పవన్ కళ్యాణ్ రెడ్డి... ఆ యువతి ఫోటోలను ఆమె కుటుంబ సభ్యులకు పంపించాడు.
దీంతో ఆ యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషనులో ఫిర్యాదుచేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తన ప్రియురాలు దూరం కావడంతో తీవ్ర మానసిక వేదనకుగురై, సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఆ యువతిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.