ఆదివారం, 16 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

భార్య కేసు పెట్టిందని మనస్తాపంతో టెక్కీ భర్త ఆత్మహత్య

suicide
హైదరాబాద్ నగరంలోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య తనపై కక్షకట్టి కేసు పెట్టి పదేపదే పోలీస్ స్టేషన్‌కు పిలుపిస్తుండటంతో జీర్ణించుకోలేని ఆ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరంలోని బన్సీలాల పేట కృష్ణా నగర్‍కు చెందిన శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉండగా, పెద్ద కుమారుడు 12 యేళ్ల క్రితం మరణించాడు. చిన్న కుమారుడు విశాల్‌ గౌడ్‌(28) టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తూ.. 2023 డిసెంబర్‌లో నవ్య అనే యువతిని వివాహం చేసుకున్నాడు. 
 
కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. నవ్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ గొడవలపై పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీ జరిగి ఒక్కటైనా కూడా మళ్లీ విభేదాలు తలెత్తాయి. ఈ ఏడాది మార్చిలో నవ్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి తిరిగి రాలేదు. 
 
ఈ క్రమంలో రెండు నెలల క్రితం నవ్య ఫిర్యాదు మేరకు ఉప్పల్‌ పోలీసుల నుంచి విశాల్‌గౌడ్‌కు ఫోన్‌ రావడంతో కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు. అనంతరం కేసు నమోదు కావడంతో స్టేషన్‌కు రమ్మని మరోసారి ఉప్పల్‌ పోలీసులు ఫోన్‌ చేశారు. 
 
ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం  తన గదిలోకి వెళ్లి బయటకు రాకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా.. సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.