యేడాదిగా టీచర్లు హేళన చేస్తున్నారు... సారీ మమ్మీ... నా అవయవాలను దానం చేయండి...
ఢిల్లీలోని సెయింట్ కొలంబియా పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 16 యేళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను రాసిన సూసైడ్ నోట్ ఇపుడు ప్రతి ఒక్కరినీ కంట తడిపెట్టిస్తోంది. ఒక యేడాది కాలంగా టీచర్లు తనను హేళన చేస్తున్నారని, ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే పాఠశాల నుంచి బహిష్కరిస్తామంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నాడు. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపారు. పైగా తన అవయవాలను నలుగురికి ఉపయోగపడేలా ఎవరికైనా దానం చేయాలని కోరాడు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి పేరు శౌర్య పాటిల్. సెంట్రల్ ఢిల్లీలోని తన పాఠశాల నుంచి నేరుగా మెట్రో స్టేషన్‌కు వల్లి ఎత్తైన ఫ్లాట్‌ఫామ్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో తీవ్ర కలకలం రేపింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహంతో పాటు సూసైడ్ లేఖను కూడా స్వాధీనం చేసుకున్నారు.
"క్షమించండి మమ్మీ, నేను నిన్ను ఎన్నోసార్లు బాధపెట్టాను. చివరిసారిగా మళ్లీ బాధపెడుతున్నాను. పాఠశాలలో ఉపాధ్యాయులు అలా ఉన్నారు. నేనేం చెప్పను" అని లేఖ రాసుకొచ్చాడు. అతను రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తన మరణానంతరం తన అవయవాలను ఎవరికైనా ప్రయోజనం చేకూర్చేలా దానం చేయాలని, తనను ఈ దుస్థితికి తీసుకువచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ నోట్లో కోరాడు.
సంవత్సరం కాలంగా ఉపాధ్యాయులు తనను ఎగతాళి చేస్తూ మాట్లాడినట్లు శౌర్య పాటిల్ పేర్కొన్నాడు. తనను ఉపాధ్యాయులు వేధిస్తున్నారని తల్లిదండ్రులకు చెబితే, పాఠశాల నుంచి బహిష్కరిస్తామని కూడా ఉపాధ్యాయులు హెచ్చరించారని పేర్కొన్నాడు.
తన కొడుకు ఆత్మహత్య చేసుకున్న రోజు ఉపాధ్యాయులు అతనిని డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వేదిక మీదనే అందరిముందు అవమానించారని శౌర్య తండ్రి ఆరోపించారు. ఉపాధ్యాయులు అవమానించిన సమయంలో తన కొడుకు వేదిక పైనే ఏడ్చాడని, దీంతో ఒక ఉపాధ్యాయుడు నిర్లక్ష్యంగా, 'ఎంత ఏడ్చినా మాకు అభ్యంతరం లేదు' అని చెప్పాడని తండ్రి వాపోయారు.
తన కొడుకు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ప్రిన్సిపల్ తనకు ఫోన్ చేసి ఏ సహాయం కావాలన్నా చేస్తామని చెప్పాడని, అలా అయితే తన కొడుకును తిరిగివ్వమని సమాధానం చెప్పానని కన్నీరుమున్నీరయ్యారు. కాగా, విద్యార్థి ఆత్మహత్య కేసులో స్కూల్ ప్రిన్సిపాల్‌తో సహా మరో ముగ్గురు ఉపాధ్యాయులను ఢిల్లీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే, ఐదుగురు సభ్యులతో అత్యున్నత విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.