గోడకు కన్నం వేసి.. రూ.12కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు.. ఎక్కడ?
మధ్యప్రదేశ్‌లోని కట్నీలో గురువారం తెల్లవారుజామున దొంగలు గోడను పగలగొట్టి, సేఫ్, డిస్‌ప్లే కౌంటర్లను తెరిచి దాదాపు రూ.12 కోట్ల విలువైన ఆభరణాలను దొంగిలించారని పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం సిబ్బంది షోరూమ్‌కు చేరుకున్నప్పుడు, సేఫ్ (భద్రతా పెట్టె), డిస్‌ప్లే కౌంటర్లు పగలగొట్టి ఉండటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
షోరూమ్ యజమాని మోహన్ బజాజ్ మాట్లాడుతూ, తమ షోరూమ్‌లో రూ.12 కోట్ల నుండి రూ.15 కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నాయని, అందులో సుమారు రూ.12 కోట్ల విలువైన ఆభరణాలు కనిపించకుండా పోయాయని తెలిపారు. అయితే, రికార్డులను ఆడిట్ చేసిన తర్వాతే చోరీకి గురైన ఆభరణాల ఖచ్చితమైన విలువ తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.
కట్నీ జిల్లా ఎస్పీ అభినవ్ విశ్వకర్మ షోరూమ్‌ను పరిశీలించి, ప్రాథమిక విచారణ ప్రకారం నవంబర్ 12న తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 7 గంటల మధ్య ఈ చోరీ జరిగిందని చెప్పారు. దొంగలు గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించారని, దీన్ని బట్టి ఈ నేరం చాలా ప్రణాళికాబద్ధంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని షోరూమ్ లోపల అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలు ఎలా వచ్చారు, ఏ దిశగా పారిపోయారు అనే వివరాలను గుర్తించేందుకు సమీప రోడ్లు, మార్కెట్లు, ఇతర కీలక ప్రదేశాలలో అమర్చిన కెమెరాల రికార్డింగ్‌లను కూడా పరిశీలిస్తున్నారు.
ఫోరెన్సిక్ బృందం, వేలిముద్రల నిపుణులు సంఘటనా స్థలం నుండి సాక్ష్యాలను సేకరించారు. షోరూమ్‌లో ఉన్న నగల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, కచ్చితమైన స్టాక్, పోయిన వస్తువుల విలువను కనుక్కుంటున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు, కానీ కొన్ని కీలక ఆధారాలు లభించాయని పోలీసులు చెబుతున్నారు.

