నేను బ్రతికే వున్నాను బాబోయ్... పాపం ఇజ్రాయెల్ ప్రధానికి ఎన్ని కష్టాలో? కొత్త వీడియో
సోషల్ మీడియా AI వీడియోలు ఇప్పుడు ఏకంగా ఓ దేశ ప్రధానినే గజగజ వణికిస్తున్నాయి. ఇరాన్ పైన ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల చేస్తున్న వేళ గత నాలుగైదు రోజుల్నుంచి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఇరాన్ దాడుల్లో మరణించాడంటూ సోషల్ మీడియాలో వీడియోలు హెల్చల్ చేస్తున్నాయి. ఈ వీడియోలన్నీ ఫేక్ వీడియోలేనని ఎంత చెప్పినా ప్రజలు నమ్మడం లేదు. దీనితో ఏకంగా నెతన్యాహు ఓ కాఫీ షాపులో కాఫీ తాగుతూ వీడియోను రిలీజ్ చేసారు. అందులో ఆయన మాట్లాడుతూ... తనకు కాఫీ అంటే చచ్చేంత ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు.
ఐతే ఈ వీడియో కూడా ఏఐ వీడియో అంటూ మళ్లీ రచ్చ చేసారు. దాంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈసారి కాస్తంత నిడివి ఎక్కువున్న వీడియోలో కనిపించి దాన్ని షేర్ చేసారు. అందులో కొంతమంది ప్రజలతో ముచ్చటిస్తూ కనబడ్డారు. ఆయన పక్కనే ఓ కుక్క కూడా కనబడింది. మొత్తమ్మీద తను మరణించలేదని ప్రజలకు చెప్పేందుకు నెతన్యాహు వరుస వీడియోలు చేయాల్సి వస్తోంది.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చనిపోయాడంటూ సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి వస్తున్న వార్తలకు నెతన్యాహు చెక్ పెట్టారనుకుంటుంటే మళ్లీ కొత్త ట్విస్ట్ వచ్చింది. X లోని Grok నెతన్యాహు కాఫీ తాగుతున్నట్లు కనిపించిన వీడియో డీప్ ఫేక్ ఏఐ వీడియో అంటూ తేల్చింది. దీనితో నెటిజన్లు మళ్లీ ట్రోల్స్ స్టార్ట్ చేసారు. నెతన్యాహు చనిపోయినప్పటికీ ఏవేవో ఏఐ వీడియోలు జనరేట్ చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఐతే గత రాత్రి నెతన్యాహు అఫీషియల్ X ఖాతా నుంచి విడుదలైన వీడియోలో ఆయన ఎంతో హుషారుగా కాఫీ తాగుతూ తన రెండు చేతులకు వున్న వేళ్లను చూపుతా మాట్లాడారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెతన్యాహు బ్రతికే వున్నాడని అనుకున్నారు. ఐతే ఇప్పుడు సోషల్ మీడియాలో నెతన్యాహు కాఫీ తాగుతూ కనిపించిన వీడియో కూడా ఫేక్ అని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నెతన్యాహు బ్రతికే వున్నాడని తెలియాలంటే ఆయన ఏదైనా పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలేమో..?
ఇదిలావుంటే అమెరికా- ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ పైన చేస్తున్న సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యూహు ప్రాణాలు కోల్పోయినట్టు ఊహాగానాలు సోషల్ మీడియాలో వచ్చాయి. వీటిని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. నెతన్యాహు క్షేమంగా ఉన్నారని, ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు అధికారికంగా వెల్లడించింది.
గత కొన్ని రోజులుగా నెతన్యాహుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు చేతులు పైకెత్తగా, ఆయన చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపించడంతో ఈ వదంతులు మొదలయ్యాయి. ఇది ఏఐ సాయంతో సృష్టించిన డీప్ ఫేక్ వీడియో అని, నెతన్యాహు చనిపోయి ఉండవచ్చని లేదా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని నెటిజన్లు ప్రచారం చేశారు.
ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారిక ఖాతా నుంచి నెతన్యాహు మరణవార్తను పోస్ట్ చేసి డిలీట్ చేశారంటూ ఓ ఫేక్ స్క్రీన్ షాట్ కూడా వైరల్ అయింది. మార్చి 14, 15 తేదీల్లో ఈ పుకార్లు తీవ్రరూపం దాల్చడంతో ప్రధాని కార్యాలయం రంగంలోకి దిగింది. టర్కీకి చెందిన వార్తా సంస్థ అనడోలు ఏజెన్సీ ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. ఇది ఫేక్ న్యూస్, ప్రధాని క్షేమంగా ఉన్నారు అని తేల్చిచెప్పింది. దీనికి బలం చేకూరుస్తూ ఇప్పుడు నెతన్యాహు స్వయంగా వీడియోను విడుదల చేసారు.