తడిసి మోపెడవుతున్న ఏఐ ఖర్చులు.. మరోసారి లే ఆఫ్‌లకు ఒరాకిల్ సిద్ధం...
కృత్రిమ మేథ (ఏఐ) టెక్నాలజీ కోసం పెట్టే ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఈ ఖర్చును భర్తీ చేసుకునేందుకు వీలుగా పలు టెక్ కంపెనీలు ఉద్యోగుల్లో కోత విధిస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెక్ కంపెనీ ఒరాకిల్ మరోమారు లే ఆఫ్‌లకు సిద్ధమైంది. ఈ నెలలోనే మరోమారు భారీ సంఖ్యలో లే ఆఫ్‌లు ప్రకటించనుందని తెలుస్తోంది. ఏఐ టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకునేందుకు డేటా సెంటర్ల నిర్మాణం, ఏఐ చిప్‌లను కొనుగోలు చేయడం, ఓపెన్ ఏఐ వంటి ఏఐ క్లయింట్లకు మద్దతు ఇచ్చేందుకు ఒరాకిల్ భారీగా పెట్టుబడులు పెడుతోంది.
ఇప్పుడు ఆ ఖర్చును భర్తీ చేసుకునేలా ఉద్యోగులను తగ్గించుకోవాలని చూస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఆ సంఖ్య ఎంతనేది మాత్రం వెల్లడికాలేదు. సెప్టెంబర్ ఒకటి నుంచి రెండో త్రైమాసికం ప్రారంభం కావడానికి ముందే ఈ కోతలు అమలు చేయాలని భావిస్తోంది. కొన్ని బృందాల్లో కోతలు డబుల్ డిజిట్‌లో ఉండనున్నట్లు సమాచారం.
గతంలోనూ ఒరాకిల్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. 12 నెలల్లో 21 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు జూన్ నెలలో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమ మేథను భాగం చేయడంతో ఉద్యోగులను తగ్గించుకోవాల్సి వచ్చిందని, భవిష్యత్తులోనూ ఈ కోతలు కొనసాగుతాయని గతంలోనే ప్రకటించింది. ఇందులోభాగంగా మరోమారు లే ఆఫ్‌లకు సిద్ధమవుతోంది.

