బంకా జిల్లాలో యువతిని వేధిస్తున్న యువకులు... వారంలో మూడో వీడియో
బీహార్ రాష్ట్రంలో యువతులను వేధింపులకు గురిచేసిన వీడియోలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. వారం రోజుల్లో ఈ తరహా వీడియా రావడం ఇది మూడోది. ఇటీవల జమౌ జిల్లాలో తన స్నేహితుడితో కలిసి ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న యువతిని కొందరు కామాంధులు లైంగికంగా వేధించిన విషయం తెల్సిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు కాల్పులు జరిపారు.
ఈ ఘటన మరిచిపోకముందే.. సమస్తిపూర్ జిల్లాల్లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. ఇపుడు బంకా జిల్లాలో మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వారం రోజుల్లోనే బిహార్‌లో ఇది మూడో ఘటనగా నిలిచింది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
బంకా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మందార్ హిల్‌లో ఓ యువతిని కొందరు యువకులు వేధిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా సెల్‌కు వాట్సాప్ ద్వారా వీడియో అందడంతో అధికారులు దృష్టి సారించారు.
బౌన్సీ స్టేషన్ పోలీసులు.. మందార్ హిల్‌కు వెళ్లి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. వీడియో మందార్ హిల్‌లోనే చిత్రీకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. అయితే వీడియో ఇటీవలిది కాదని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన ఈ ఏడాది ఏప్రిల్లో జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
వీడియోలో ఆరుగురు నుంచి ఏడుగురు యువకులు ఉన్నట్లు గుర్తించారు. వారి వివరాలు, యువతి గుర్తింపును ఇప్పటివరకు పోలీసులు నిర్ధారించలేకపోయారు. స్థానిక గ్రామస్థులు, దుకాణదారులను విచారిస్తూ నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. అలాగే, వీడియోను ఎవరూ షేర్ చేయొద్దని పోలీసులు స్థానికులను కోరారు.

