1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. tirupati tuda park,

తిరుపతిలో తుడా పార్కు.. స్టార్‌ హోటల్‌కు బలి... తితిదే అధికారుల తీరే అంత!

tirupati tuda park
ఏ మాటల వెనుక ఏ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకునేంత కాలం మోసపోతూనే ఉంటాం అని కమ్యూనిస్టు మహానుభావుడొకరు ఎప్పుడో చెప్పారు. అధికారులు, పాలకుల నిర్ణయాలూ అలాగే ఉంటాయి. వాళ్ళు చేసే ఏ నిర్ణయం వెనుక ఏ ప్రయోజనం ఉందో తరచిచూస్తే గానీ అర్థం కాదు. తిరుచానూరు రోడ్డులో, అర్బన్‌ హాట్‌కు సమీపంలోని తుడా పార్కు మూసివేత వెనుక పక్కనే ఉన్న స్టార్‌ హోట్‌ ప్రయోజనాలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ సంగతేమిటంటే...
 
శిల్పారామం పక్కనే దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవాన్ని చాలా యేళ్ళ క్రితం తుడా ఏర్పాటు చేసింది. బోటు షికారు కోసం చిన్న చెరువు వంటిది త్రవ్వింది. చుట్టూ పచ్చిక పెంచింది. మొక్కలు నాటింది. కొబ్బరిచెట్లు పెట్టింది. ఈ పార్కులో ఒక మహనీయుడి విగ్రహం కూడా ప్రతిష్టించింది. చాలా కాలం ఈ పార్కుకు సందర్శకులు వచ్చేవారు. బోటు షికారు చేసేవారు. తుడాకు ఏమైందో కానీ కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ పార్కును గత కొన్నేళ్లుగా మూసేసింది. సందర్శకులను అనుమతించడం లేదు.
 
అటు శిల్పారామం, ఇటు తుడా పార్కుకు మధ్యలో గ్రాండ్‌ రిడ్జ్ పేరులో ఒక స్టార్‌ హోటల్‌ను నిర్మించారు. తుడా పార్కు ఆ హోటల్‌ ఆవరణలో కలిసిపోయినట్లు ఉంటుంది. హోటల్‌కు వచ్చేవారికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందన్న భావనతోనే తుడా పార్కును మూసేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. లేకుంటే హోటల్‌ ప్రారంభమయ్యే దాకా ఉన్న పార్కును ఆ తరువాత ఎందుకు మూసేస్తారని ప్రశ్నిస్తున్నారు. పార్కు మూసేశారంటే దాన్ని ఆలనా పాలనా పట్టించుకోవడం లేదని కాదు. ఇప్పటికీ ఆ పార్కును బాగానే నిర్వహిస్తున్నారు. తుడా ఉద్యోగులు ముగ్గురు నిత్యం ఆ పార్కు బాధ్యతల్లో ఉంటున్నారు. రోజూ పచ్చికకు, మొక్కలకు నీళ్లు పట్టడం వంటి పనులు చేస్తున్నారు. కొబ్బరి చెట్లు ఏపుగా పెరిగి ఆహ్లాదంగా పంచుతున్నాయి. ఈ ఆహ్లాదమంతా పక్కనే ఉన్న స్టార్‌ హోటల్‌లో బస చేసేవారికి మినహా స్థానికులకు దొరకడం లేదు.
 
పక్కనే శిల్పారామంలో బోటు షికారు ఉంది. అందుకే తుడా పార్కులో బోటు షికారు ఎత్తేశారనుకున్నా పార్కులోకి స్థానికులను అనుమతించవచ్చు. స్థానికులు రోజూ 20 రూపాయలు ఖర్చు చేసి శిల్పారామంలోకి వెళ్ళడం సాధ్యం కాదు. తుడా పార్కును స్థానికులకు కేటాయించి ఉచిత ప్రవేశం కల్పిస్తే ఎంతో ఉపయోగపడుతుంది. తిరుపతి నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపుదిద్దే క్రమంలో బైరాగిపట్టెడ పార్కును, ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్ కళాశాల పక్కనున్న జగజ్జీవనం రాం పార్కును, ఇతర పార్కులను కోట్ల రూపాయలతో తుడా మరింత అభివృద్థి చేస్తోంది. మరెందుకో తిరుచానూరు రోడ్డులోని పార్కును మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ పార్కు వద్దే ఆర్చి కోసం చేపట్టిన నిర్మాణం అసంపూర్తిగా ఉంది. మొండిగోడల్లాగా దర్శనమిస్తూ అంద వికారంగా ఉన్నాయి. 
 
ఇప్పటికైనా తిరుచానూరు తుడా ఉద్యానవనాన్ని పూర్తి స్థాయిలో అభివృద్థి చేసి స్థానికులకు ఉచిత ప్రవేశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో స్టార్‌ హోటల్‌ కోసమే పార్కులోకి సందర్సకులను అనుమతించడం లేదని స్థానికులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్లు అవుతుంది.
తర్వాతి కథనం
ఇల్లు బాగానే ఉంటుంది... కానీ ఇంట్లోవారి పరిస్థితి ఏమీ బాగోదు... వాస్తు దోషాలు, ఆ స్థలాలతో ఇబ్బందులు...