1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Bandi Sanjay Condemns Success School Homework Row

విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తాం : కేంద్ర మంత్రి బండి సంజయ్

bandi sanjay kumar
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే హిందూ విద్యార్థులందరికీ బొట్టు (సిందూరం) తప్పనిసరి చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సైదాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో హిందూ విద్యార్థులకు కల్మా, సురా ఫతేహా చదవాలని హోంవర్క్ ఇచ్చారన్న వివాదంపై ఆయన స్పందించారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను పాటించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 
 
ఈ ఘటనపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సంస్కృతిపై బలవంతంగా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ విద్యార్థులకు కల్మా, సూరా ఫతేహా చదవాలని ఆదేశించడం దుర్మార్గమన్నారు. సక్సెస్ ప్రైవేట్ స్కూల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనను సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. సెక్యులర్ సంఘాలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 
 
సైదాబాద్‌లో సక్సెస్ ప్రైవేట్ స్కూల్లో రెండో తరగతి హిందూ విద్యార్థులకు కల్మా, సూరా ఫతేహా చదవాలని హోంవర్క్ ఇచ్చినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. స్కూల్ డైరీలో ఈ హోంవర్క్ రాసినట్లు చెబుతున్నారు. మరోవైపు, కల్మా చదవాలని హోంవర్క్ ఇచ్చిన ఉపాధ్యాయురాలిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఇలాంటి ఘటన తమ పాఠశాలలో ఇదే తొలిసారి జరిగిందని వివరణ ఇచ్చింది.
 
ఈ ఘటనపై బీజేపీ నేతలు స్కూల్‌ను ముట్టడిస్తామని హెచ్చరించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. స్కూల్‌‍కు వెళ్లే మార్గాలను మూసివేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. తెలంగాణలోని కొన్ని పాఠశాలలు హిందూ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని చిన్నారులను ఇస్లాం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి పాఠశాలలు, ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే వారిని జైలుకు పంపాలని అన్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి