సంబంధిత వార్తలు
- కొడంగల్ ముఖ చిత్రాన్ని మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎలా?
- లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలి.. సీఎం రేవంత్ రెడ్డి
- తెలంగాణాలో తొలిసారి సరస్వతీ నది పుష్కరాలు.. ప్రారంభించిన కంచి పీఠాధిపతి
- రేవంత్ రెడ్డి కమలం పార్టీలో చేరొచ్చు... ప్రధాని మోడీ పిలుపునకు ఆంతర్యమిదే : బీజేపీ ఎంపీ అర్వింద్
- Revanth in National Politics: 2034 వరకు సీఎం.. ఆ తర్వాత జాతీయ రాజకీయాలు.. రేవంత్ రెడ్డి
మోటార్లకు మీటర్లు అమర్చినా.. ఉచిత విద్యుత్ నిలిపివేసినట్టు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయం : సీఎం రేవంత్ సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టినట్టు, రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను నిలిపివేసినట్టు నిరూపిస్తే తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని ఆయన ప్రకటించారు. అలాగే, తాము ఉచిత విద్యుత్ కొనసాగిస్తే బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉంటుందా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతుల ముసుగులో కేసీఆర్ రాజకీయ లబ్దికి యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
'అన్నదాతలకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నాం. ఉచితంగా అందిస్తున్న విద్యుత్ వినియోగాన్ని దీనికి కనెక్ట్ చేస్తున్నాం. రైతు డిస్కంతో జవాబుదారీతనం పెరుగుతుంది. మేం ఏడాదికి రూ.70 వేల కోట్లు అప్పు చేస్తే.. రూ.95 వేల కోట్ల అప్పు తీరుస్తున్నాం. మేం తీరుస్తున్న అప్పుల గురించి హరీశ్‌రావు చెప్పడం లేదు. రూ.54 వేల కోట్లు అప్పులు తీసుకుంటామని ముందే చెప్పాం. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి అప్పులు చేయడానికి అనుమతి లేదు.
కేసీఆర్ మీద ఒట్టేసి.. బీఆర్‌ఎస్‌లోనే ఉంటానని హరీశ్‌రావు చెప్పాలి. గతంలోనూ హరీశ్‌రావు.. వైఎస్సార్ దగ్గరికి వెళ్లారు. ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారో నాకు తెలుసు.. కానీ చెప్పను. ఇటీవల పార్టీ మీటింగ్ వదిలేసి ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? భాజపా, బీఆర్‌ఎస్‌లు కలిసి పోటీ చేస్తాయనడంలో అనుమానమే లేదు. సీబీఎస్‌ఈలో జవాబుపత్రాలు తారుమారు చేసిన గ్లోబరీనా.. కేటీఆర్ బినామీ సంస్థ.
కేంద్రంలోని బీజేపీ సర్కారు వడ్లు సరిగ్గా కొనుగోలు చేయడం లేదు. రాష్ట్రంలో 32 శాతం ధాన్యం మాత్రమే కొంటోంది. భాజపా నేతల ఇళ్ల ముందు ధాన్యం పోస్తాం. అంతర్రాష్ట్ర జలవివాదాలను సహకార ధోరణితో పరిష్కరించుకోవాలని ప్రధాని మోడీ చెబుతున్నారు. ప్రాణహిత ప్రాజెక్టుపై మహారాష్ట్ర సీఎంతో చర్చలకు ప్రయత్నిస్తున్నాం. ఆయన ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.
అలాగే, తాను 2034 వరకు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటాను. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, నాది విజయవంతమైన కాంబినేషన్. మేం అన్ని ఎన్నికలు గెలిచాం. భవిష్యత్తులోనూ విజయం సాధిస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయనకు మంచి పదవి రావొచ్చు. ఎన్టీఆర్‌ను కులం, ప్రాంతంతో పోల్చడం బుద్ధిలేనితనం అని వ్యాఖ్యానించారు.
