హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులకు శుభవార్త - ఐటీ కారిడార్‌లో వన్ వే లూప్
హైదరాబాద్ నగరంలోని ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ పోలీస్ విభాగం శుభవార్త చెప్పింది. ఐటీ కారిడార్‌లో నానాటికీ తీవ్రతరమవుతున్న వాహనాల రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు సరికొత్త ప్రణాళికతో ముందుకొస్తున్నారు. ఐకియా, మైండ్ స్పేస్, బయోడైవర్శిటీ వంటి అత్యంత రద్దీ కూడళ్లను కలుపుతూ వన్ వే లూప్ విధానాన్ని అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇది అమలైతే వాహనాలు సిగ్నళ్ల వద్ద ఆగకుండా నిరంతరాయంగా ఒకే మార్గంలో ప్రయాణించే వీలు కలుగుతుంది.
ఐటీ కారిడార్‌లో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతగా ఉంటోంది. ముఖ్యంగా, ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఒకేసారి బయటకు రావడంతో ప్రధాన కూడళ్ళ వద్ద వాహనాలు గంటలు తరబడి నిలిచిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు పోలీసులు వన్ వే లూప్ విధానంపై దృష్టిసారించారు. దీని ద్వారా ఐకీయా నుంచి బయోడైవర్శిటీ జంక్షన్‌కు, అక్కడ నుంచి టీ వర్క్స్, మైహోం భుజా మీదుగా తిరిగి ఐకీయా వైపు వాహనాలు ఒకే వలయాకార మార్గంలో ప్రయాణిస్తాయి.
ఇప్పటికే కేబీఆర్ పార్కు చుట్టూ ఈ విధానం విజయవంతం కావడంతో అదే తరహాలో ఇక్కడ కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై సబరాబాద్ సీపీ ఎం, రమేశ్, జాయింట్ సీపీ సన్‌ప్రీత్ సింగ్‌తో పాటు డీజీపీ సీవీ ఆనంద్ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ట్రాఫిక్ పోలీసులు సిద్ధం చేసిన మూడు రకాల ప్రతిపాదనలు డీజీవీ వివరించారు. జీహెచ్‌ఎంసీ, టీఎస్ఐఐసీ అధికారులతో చర్చించిన అనంతరం, సాధ్యాసాధ్యాలను బట్టి ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

